మలి విడత పురపోరుకు సై!

Municipal Elections In Telangana May Start In April Or May - Sakshi

వార్డుల పునర్విభజన షెడ్యూల్‌ ప్రకటన 

మార్చి 7న పునర్విభజన ముసాయిదా ప్రకటన 

మార్చి 25న తుది నోటిఫికేషన్‌ జారీ 

ఏప్రిల్‌/ మే నెల్లో మున్సిపల్‌ ఎన్నికలు?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మలి విడత మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు వార్డుల పునిర్వభజన షెడ్యూల్‌ను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 25 వరకు వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ఆయా పురపాలికలు చర్యలు చేపట్టనున్నాయి. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య పెరగడంతో ఈ స్థానాల్లో వార్డుల పునర్విభజన, వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లో వార్డుల పునర్విభజనతో పాటు చైర్‌పర్సన్, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. 

ఏప్రిల్‌/ మేలో ఎన్నికలు.. 
గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్‌కర్నూల్‌ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు మార్చి 14తో, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్‌ 15తో ముగియనుంది. వీటితో పాటు గ్రామ పంచాయతీల స్థాయి నుంచి మున్సిపాలిటీలుగా మారిన నకిరేకల్‌ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్‌నగర్‌ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)కు ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఏడు పురపాలికలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య సైతం పెరగడంతో ఈ స్థానాల్లో వార్డుల పునర్విభజనతో పాటు వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లో వార్డుల పునర్విభజనతో పాటు చైర్‌పర్సన్, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. వార్డుల పునర్విభజన ప్రక్రియ మార్చి 25తో ముగియనుండగా, వార్డులు, చైర్‌పర్సన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన ప్రక్రియను మరో 2 వారాల్లోగా పూర్తి చేసే అవకాశముంది. అనంతరం వచ్చే ఏప్రిల్‌ చివరి వారం లేదా మే నెలలో ఈ ఏడు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.  

కార్యక్రమం గడువు తేదీ

  • జనాభా గణన విభాగం నుంచి వార్డుల వారీగా చివరి జనాభా లెక్కల గణాంకాలను సేకరించడం లేదా జిల్లా ఎన్నికల అధికారి నుంచి తాజా ఓటర్ల జాబితాను తీసుకోవడం    24 ఫిబ్రవరి  
  • వార్డుల పునిర్వభజన ఉత్తర్వుల్లోని నిబంధనలను పాటిస్తూ మున్సిపాలిటీలు క్షేత్ర స్థాయి సర్వే ద్వారా ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి    25 ఫిబ్రవరి నుంచి 6 మార్చి 
  • మున్సిపాలిటీను వార్డులుగా విభజన ప్రతిపాదనలు, సాధారణ ప్రజల నుంచి సలహాల స్వీకరణకు నోటిసు జారీ ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు, ఎంపీలకు ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేయడం. పత్రికల్లో ప్రచురించడం    మార్చి 7 నుంచి 8 వరకు  
  • సాధారణ ప్రజలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సలహాలు/సూచనలు కోరడం మార్చి 9 నుంచి 15 వరకు  
  • సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిష్కరించడం మార్చి 16 నుంచి 21 వరకు  
  • పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్‌కు నివేదిక సమర్పించడం    మార్చి 22 
  • రాష్ట్ర ప్రభుత్వానికి పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్‌ నివేదిక సమర్పించడం    మార్చి 23 నుంచి 24 వరకు 
  • వార్డుల పునిర్వభజనపై తుది నోటిఫికేషన్‌ జారీ    మార్చి 25   
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top