వరంగల్, ఖమ్మం మున్సిపోల్స్‌ వాయిదా?

municipal elections May Postponed In Telangana - Sakshi

కొన్ని పురపాలికల్లో వార్డుల సంఖ్య మళ్లీ పెంచాలని ప్రభుత్వం యోచన 

ఆ తర్వాతే పురపాలికలకు ఎన్నికలు  

ఆలోగా పూర్తికానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, సాగర్‌ ఉప ఎన్నికలు  

వార్డుల పునరి్వభజన ప్రక్రియ ఇప్పుడే చేపట్టవద్దని ప్రభుత్వం నుంచి సూచనలు 

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికలను కొంతకాలం పాటు వాయిదా వేసి ప్రత్యేకాధికారుల పాలన విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్‌కర్నూల్‌ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు మార్చి 14తో, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్‌ 15తో ముగియనుంది. వీటితో పాటు గ్రామ పంచాయతీల స్థాయి నుంచి మున్సిపాలిటీలుగా మారిన నకిరేకల్‌ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్‌నగర్‌ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)కు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు మరికొన్ని పురపాలికల్లో వార్డుల సంఖ్యను పెంచాలని, ఆ తర్వాతే మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఈ మేరకు తెలంగాణ మున్సిపాలిటీల చట్టాన్ని సవరిస్తూ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. సిద్దిపేటలో ప్రస్తుతం 43 వార్డులు ఉండగా.. ఆ సంఖ్యను 50కు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. వరంగల్‌తో పాటు మరికొన్ని చోట్లలో వార్డుల సంఖ్య పెంచాలని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చిట్టు సమాచారం. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఇదే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నాయి. తర్వాత సాగర్‌ ఉప ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాతే మలి విడత మున్సిపల్‌ ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం గత కొంతకాలంగా ఆలోచన చేస్తోంది. ఆలోగా మున్సిపల్‌ వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగైనా కొంతకాలం పాటు ఈ ఏడు పురపాలికల ఎన్నికలను వాయిదా వేసి వాటి పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.  

వార్డుల పునర్విభజనకు బ్రేక్‌  
పురపాలికల పాలకవర్గాల గడువు ముగింపునకు 3నెలల ముందు నుంచే తదుపరి ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారం భించాలని తెలంగాణ మున్సిపాలిటీల చట్టం పేర్కొంటోంది. ఈ మేరకు గడువు ముగియనున్న/ ముగిసిన 7 పురపాలికల్లో త్వరగా ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని గత నెలలో ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య సైతం పెరగడంతో ఈ స్థానాల్లో వార్డుల పునరి్వభజన, వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లో వార్డుల పునరి్వభజనతో పాటు చైర్‌పర్సన్, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది.

గ్రేటర్‌ వరంగల్, సిద్దిపేట తదితర పురపాలికల్లో వార్డుల సంఖ్యను మళ్లీ పెంచాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్‌ పడిందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈమేరకు ప్రభుత్వ వర్గాల నుంచి పురపాలక శాఖకు సూచనలు వచి్చనట్టు తెలిసింది. అత్యవసర ఆర్డినెన్స్‌ లేదా మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చిన తర్వాతే వార్డుల పునరి్వభజన ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టే అవకాశాలున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top