రుణమాఫీ నిధులు  విడుదల చేయాలి

MP Revanth Reddy Demand For Loan Waiver - Sakshi

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ 

కల్వకుర్తి : రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్,  ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ సూచన మేరకు సన్న వడ్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు దిగుబడి సరిగా రాలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా రాలేదని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తేల్చాలని అడిగారు. రైతులకు 26 లక్షల టన్నుల యూరియా ఉచితంగా ఇస్తామని 2017లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారని సీఎంను విమర్శించారు. తమది రైతు ప్రభుత్వమని చెప్తున్న సీఎం కేసీఆర్‌ కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ఈ చట్టాలను రద్దుచేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఆరో రోజుకు రేవంత్‌ పాదయాత్ర 
ఊర్కొండ: రేవంత్‌రెడ్డి పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ, వెల్దండ మండలాల్లో పాదయాత్ర కొనసాగింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేటలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. జకినాలపల్లి, ఇప్పపహాడ్‌ గ్రామాల మీదుగా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద సోయి లేకుండా, మద్యాన్ని ఏరులై పారిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉపఎన్నిక వచ్చిన చోట మాత్రమే వరాల జల్లు కురిపిస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఉపఎన్నిక రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top