టీచర్ల 'టెట్‌'త్తరపాటు | More than 45,000 govt teachers lack TET qualifications in Telangana | Sakshi
Sakshi News home page

టీచర్ల 'టెట్‌'త్తరపాటు

Nov 17 2025 1:04 AM | Updated on Nov 17 2025 1:04 AM

More than 45,000 govt teachers lack TET qualifications in Telangana

సుప్రీంకోర్టు తీర్పుతో టెట్‌ తప్పనిసరి

రాష్ట్రంలో 45 వేల మందికి పైగా ప్రభుత్వ టీచర్లకు లేని అర్హత

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు సిలబస్‌ భయం.. సైన్స్‌ టీచర్‌కు మేథ్స్‌ గండం, మేథ్స్‌ బోధిస్తున్న వారికి సైన్స్‌ గుబులు 

పరీక్ష కోసం సెలవులు.. ప్రత్యేక ట్యూషన్లు తీసుకుంటూ తిప్పలు 

పాఠాలు చెప్పిన గురువులే ఇప్పుడు విద్యార్థులు.. అర్థంకాని ఆన్‌లైన్‌ కోచింగ్‌ 

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాలపై ఒత్తిడి

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ ప్రభుత్వ టీచర్లలో గుబులు పుట్టిస్తోంది. విద్యార్థులకు పాఠాలు చెప్పి, పరీక్షలు నిర్వహించే టీచర్లు తాము పరీక్ష రాయాలంటే భయపడుతున్నారు. సర్వీస్‌లో ఉన్న టీచర్లు కూడా టెట్‌ రాయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 వేలకుపైగా ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత లేదు. మరో ఐదేళ్లలో రిటైర్‌ అవుతున్న వారికి మాత్రం టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. 

సాధారణంగా టెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. తాజాగా బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల్లోనే తక్కువగా పాసవుతున్నారు. అలాంటిది టీచర్లు దశాబ్దాల క్రితం సర్వీస్‌లో చేరారు. అప్పటి సిలబస్‌ వేరు. ఇప్పుడున్నది వేరు. విద్యా విధానంలోనే అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విద్యార్థుల సైకాలజీ, నవీన విద్యావిధానం నుంచి టెట్‌లో ప్రశ్నలు ఇస్తారు. వీటిపై ఇన్‌ సర్వీస్‌లో ఉన్న టీచర్లకు అవగాహన తక్కువే. 

అదీగాక సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కేవలం తన సబ్జెక్టుపైనే దృష్టి పెడతాడు. గణితం కూడా టెట్‌ సిలబస్‌లో ఉంటుంది. దీంతో ఇతర సబ్జెక్టులు రాయడం ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. మారిన సిలబస్, బోధన విధానాలకు అనుగుణంగానే కొన్నేళ్లుగా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్తగా టెట్‌కు సన్నద్ధం అవుతున్న యువతకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ప్రశ్నలను వెతుక్కుని తేలికగా ప్రిపేర్‌ అవుతారు. సర్వీస్‌ టీచర్లకు ఈ అవకాశం తక్కువ. ఇవన్నీ సర్వీస్‌ టీచర్లలో వణుకు పుట్టిస్తున్నాయి.  

టీచర్లకే ట్యూషన్లు: టెట్‌ కోసం అనేక మంది టీచర్లు సెలవులు పెట్టారు. తాము పాఠాలు చెప్పిన విద్యార్థుల వద్దే పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి. కొడుకు, కూతుర్ని బతిమిలాడి మరీ ఆన్‌లైన్‌లో సిలబస్‌ వెతుక్కోవాల్సి వస్తోంది. టెట్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని కోచింగ్‌ కేంద్రాలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. వీటికి విధిగా హాజరవుతున్నారు. చాలామంది టీచర్లకు ఆంగ్లభాషపై పట్టులేదు. ఆన్‌లైన్‌ మెటీరియల్స్, తరగతులు ఆంగ్ల భాషలో ఉంటున్నాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే కష్టంగా ఉందని చెబుతున్నారు.  

వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఎస్‌జీటీ పదేళ్ల క్రితం ప్రాథమిక విద్య బోధించిన విద్యార్థి చేత టెట్‌ క్లాసులు చెప్పించుకుంటున్నారు. గురువు మీద గౌరవంతో రోజూ ఇంటికి వచ్చి మరీ ఆన్‌లైన్‌ మెటీరియల్స్‌పై అవగాహన కల్పిస్తున్నాడు. 
⇒ ఖమ్మంకు చెందిన ఓ టీచర్‌ టెట్‌ కోసం నెల రోజులు సెలవు పెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న తన సన్నిహితుడి కొడుకు కోచింగ్‌ సెంటర్‌ నడుపుతుండటంతో అతని ద్వారా కోచింగ్‌ టీసుకుంటున్నారు. కోచింగ్‌ ఇచ్చే వ్యక్తి ఇంటికే ఈ టీచర్‌ వెళ్లాల్సి వస్తోంది. 
⇒ సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తున్న వికారాబాద్‌కు చెందిన ఓ టీచర్‌ మేథ్స్‌పై కోచింగ్‌ తీసుకోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నా, అర్థం కావడం లేదని చెప్పారు. పీడీఎఫ్‌ మెటీరియల్‌ కోసం అనేక చోట్ల గాలించగా.. తీరా అన్ని రకాలు దొరకడంతో పరీక్షకు ఏవి ఉపయోగపడతాయో తెలియని గందరగోళంలో ఉన్నారు. 

నేతలపై పెరుగుతున్న ఒత్తిడి 
కొన్నేళ్ల క్రితమే కేంద్రం టెట్‌ను తప్పనిసరి చేసింది. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వాలు టెట్‌ మినహాయింపు తేవడంలో విజయవంతమయ్యాయి. ఈ ఘనతను ఉపాధ్యాయ సంఘాలు తమ ఖాతాల్లో వేసుకున్నాయి. ఈసారి కూడా టెట్‌ నుంచి సర్వీస్‌ టీచర్లకు మినహాయింపు వచ్చేలా చేస్తామని, అవసరమైతే విద్యాహక్కు చట్టం మార్పుకైనా పోరాడతామని టీచర్స్‌ ఎమ్మెల్సీలు ప్రకటించారు. తీరా నోటిఫికేషన్‌ విడుదలవ్వడంతో టీచర్లకు పాలుపోని పరిస్థితి. దీంతో సంఘాల నేతలపై టీచర్లు ఒత్తిడి తెస్తున్నారు. అందరితో కాకుండా తమకు డిపార్ట్‌మెంట్‌ పరీక్షల మాదిరి నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఇది ఉపాధ్యాయ సంఘాలకూ సవాల్‌గా మారింది. 
 
టీచర్లను ఇబ్బంది పెడితే సహించం: పింగిలి శ్రీపాల్‌ రెడ్డి (టీచర్స్‌ ఎమ్మెల్సీ) 
టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసింది. ఇదే ప్రభుత్వం ఇప్పుడు టెట్‌ జీవోను సవరించి నోటిఫికేషన్‌ ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడకుండా ప్రభుత్వం తొందరపడటం, నోటిఫికేషన్‌ ఇవ్వడంలో అధికారుల వైఫల్యం, తొందరపాటు చర్య ఉంది. టెట్‌ పేరుతో టీచర్లను ఇబ్బంది పెడితే సహించం.  

ప్రభుత్వ నిర్ణయం మేరకే : డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ (పాఠశాల విద్య డైరెక్టర్‌) 
ఇన్‌సర్వీస్‌ టీచర్లు టెట్‌ రాయాలా? వద్దా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మినహాయింపు ఇస్తామని చెబితే టీచర్లు రాయాల్సిన అవసరం ఉండదు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం వెలువడలేదు కాబట్టే మేం టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చాం. మినహాయింపు కోసం న్యాయస్థానంలోనూ వాదనలు వినిస్తున్నాం.  

ఇన్నాళ్లు అవసరం లేదని...: చావా రవి (టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు) 
గత 15 ఏళ్లుగా సర్వీస్‌ టీచర్లకు టెట్‌ అవసరం లేదని ప్రభుత్వాలే చెప్పాయి. సుప్రీంకోర్టు చెప్పిందని ఇప్పుడు టెట్‌ రాయాలననడం ఏం న్యాయం? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2011కు ముందున్న టీచర్లకు టెట్‌ అవసరం లేదనే నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులను బలంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి సర్వీస్‌ టీచర్లకు న్యాయం చేయాలి.  
 

న్యాయ పోరాటం కొలిక్కి వచ్చేనా?
సెకండరీ స్కూల్‌ టీచర్లు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న టీచర్లు టెట్‌ పేపర్‌–1 రాయాలి. వీరికి ప్రాథమిక పాఠశాల స్థాయి బోధనాంశాలే సిలబస్‌లో ఇస్తారు. బీఈడీ పూర్తి చేసి ఎస్జీటీలుగా పనిచేసే వారికీ టెట్‌ రాసే అవకాశం ఉంది. స్కూల్‌ అసిస్టెంటు, జీహెచ్‌ఎంలుగా పనిచేస్తున్న వారు పేపర్‌–2 రాయాలి. సైన్స్‌ టీచర్లకు గణితం, గణితం ఉపాధ్యాయులకు సైన్స్‌ పాఠ్యాంశాలుగా ఉంటాయి. మిగతా వాళ్లంతా వారి సబ్జెక్టులకు అనుగుణంగానే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే, టెట్‌ మినహాయింపు కోసం ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తున్నా కొలిక్కివచ్చేట్టు లేదు. ఈలోగానే టెట్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. ఈ నెల 29 వరకూ టెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 3 నుంచి 31 వరకూ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement