ఉపాధ్యాయుల పేట | More than 200 govt teachers in Narsimhulapet Mahabubabad District | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల పేట

Aug 8 2025 4:55 AM | Updated on Aug 8 2025 4:55 AM

More than 200 govt teachers in Narsimhulapet Mahabubabad District

నర్సింహులపేట గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు

అక్కడ అందరి గురి టీచర్‌ వృత్తిపైనే...

ఇప్పటి వరకు 200 మందికిపైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు 

ప్రైవేట్‌ రంగంలో మరో వంద మంది 

ప్రతీ డీఎస్సీలో టీచర్‌ ఉద్యోగాలతో నర్సింహులపేట గుర్తింపు

సాక్షి, మహబూబాబాద్‌: ఆ ఊరు ఉపాధ్యాయులకు కేరాఫ్‌గా మారింది. ఎన్ని ఎకరాల భూములున్నా.. ఎంత పెద్ద కొలువు వచ్చే అవకాశం ఉన్నా.. ఈ ఊరి యువత మాత్రం బడి పంతులు ఉద్యోగానికే మొగ్గు చూపుతుంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. అందుకే మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటను ఉపాధ్యాయుల ఊరుగా చెప్పుకుంటారు.  

గ్రామ సర్పంచ్‌ చొరవతో..  
స్వాతంత్య్రానికి ముందు నుంచే నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఉండేది. అప్పుడు ఉర్దూ మీడియంలో బోధన జరిగేది. ఆ రోజుల్లో ఖాజాం అలీ అనే ఉపాధ్యాయుడు పనిచేసేవారు. ఆ తర్వాత షేక్‌ హుస్సేన్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఊరి పాఠశాలలో తెలుగు మీడియం బోధించడం మొదలు పెట్టారు. అయితే స్వాతంత్య్రం వచి్చన తర్వాత రెండో సర్పంచ్‌గా ఎన్నికైన నాయిని మనోహర్‌ రెడ్డి.. బడిపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఎస్సెస్సీ తర్వాత హెచ్‌ఎస్‌సీ కోర్సును ప్రవేశపెట్టారు.

అది చదివిన వారు ఇంటర్‌ చేయకుండానే ఎస్జీబీటీ శిక్షణకు అర్హులు. అలా ఆ ఊరిలో హెచ్‌ఎస్‌సీ చదివిన వారు.. సర్పంచ్‌ వద్దకు వెళ్లి చెప్పడంతో అప్పుడు సమితి అధ్యక్షులకు ఉత్తరం రాసి పంపితే చాలు మరుసటి రోజు నుంచే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరే వారు. ఇలా ఒక్కొక్కరుగా సమితిలో ఉద్యోగం చేరడం.. వారి తర్వాత తరం కూడా కాలానుగుణంగా ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకొని చదవడం, ఉద్యోగాలు పొందడం పరిపాటిగా మారింది. ఇలా గ్రామంలోని కుటుంబాలకు కుటుంబాలే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. గ్రామంలో పుట్టి చదువుకున్నవారే కాకుండా గ్రామం, పరిసర ప్రాంతాల్లో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండటం గమనార్హం.  

ప్రతీ డీఎస్సీలో ఉద్యోగం..  
స్వాతంత్య్రానికి ముందు ఉర్దూ మీడియం, తర్వాత తెలుగు మీడియంలో సమితి పరిధిలో నియామకాల నుంచి ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిర్వహించే డీఎస్సీ వరకు ప్రతిసారి ఈ గ్రామానికి ఉపాధ్యాయ ఉద్యోగం తప్పకుండా వస్తుందనే నమ్మకం. 2024 డీఎస్సీలో కూడా నర్సింహులపేట గ్రామం నుంచి టీచర్లు, 15 మందికి గురుకుల టీచర్‌ ఉద్యోగం వచి్చంది. ఇప్పటికీ బీఈడీ, డీఈడీ, పీఈటీ, పండిట్, టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్‌ వంటి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని డీఎస్సీ ఎప్పుడు పడుతుందా? అని ఎదురు చూసేవారు 50 మందికి పైగా ఉంటారు.

మా కుటుంబం నుంచి పది మంది టీచర్లు..  
మాది ఉమ్మడి కుటుంబం. మేం ఐదుగురం అన్నదమ్ములం. ఇందులో నలుగురం, మా బావ, మా పిల్లలు, అల్లుళ్లు మొత్తం పది మందిమి ప్రభుత్వ ఉపాధ్యాయులమే. మా ఇంట్లో ఫంక్షన్లు వస్తే అందరం ఉపాధ్యాయులమే కనిపిస్తాం. ఉపాధ్యాయులుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తాం.  
– కొండ్రెడ్డి మల్లారెడ్డి, నర్సింహులపేట

దొరవారి దగ్గరికి పోతే ఉద్యోగమే.. 
మా రోజుల్లో పంతులు ఉద్యోగం అంటే జీతం తక్కువ. అందుకోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. మా ఊరి దొరవారు (సర్పంచ్‌ మనోహర్‌ రెడ్డి) ఉపాధ్యాయ ఉద్యోగం చేయాలని ప్రోత్సహించేవారు. చదువుకొని ఆయన దగ్గరికి పోతే పోస్టు పెట్టించే వారు. మా ఇంటి నుంచి ముగ్గురం అన్నదమ్ములం, మా అక్కకొడుకు, వాళ్ల పిల్లలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులమే.  – దాసరోజు దక్షిణామూర్తి, నర్సింహులపేట

టీచర్‌ ఉద్యోగం చేయాలన్న క్రేజీ 
మా ఊరిలో ఎంత చదివాం అన్నది ముఖ్యం కాదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అందుకోసమే నేను, మా తమ్ముడు, మరదలు, ఇద్దరు కొడుకులు, కోడలు అంతా ప్రభుత్వ ఉపాధ్యాయులమే. ఏ ఉద్యోగం చేసినా లేని తృప్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది.  
– గండి మురళీధర్, నర్సింహులపేట

పూర్వం నుంచి అదే పద్ధతి 
గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటారు. వారిని చూసినప్పుడల్లా తాము కూడా అదే కావాలని కోరుకుంటూ చదువుతారు. అందుకోసమే ఇంటర్‌ పూర్తి కాగానే డీఈడీ, డిగ్రీ పూర్తి కాగానే బీఈడీ పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ డీఎస్సీలో మా ఊరికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది.   – జినుకల వెంకట్రాం నర్సయ్య, నర్సింహులపేట 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement