‘పోలీసులు లాఠీఛార్జీ చేసినా నిర‌స‌న‌లు ఆగవు’

MLA Bhatti Vikramarka Slams On TRS Govt Over Police Lathi Charge - Sakshi

కాంగ్రెస్‌ సీఎల్పీనేత భ‌ట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ స‌మ‌స్యలపై పోరాటం చేస్తున్న విద్యార్థులు, నాయ‌కుల‌పై పోలీసులు లాఠీఛార్జీ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ సీఎల్పీనేత భ‌ట్టి విక్రమార్క అ‍న్నారు. పోలీసుల లాఠీఛార్జీపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్య ప‌ద్ధతిలో గాంధీ జ‌యంతి రోజు విద్యార్థి, నిరుద్యోగ అంశాల‌పై కాంగ్రెస్ పార్టీ శాంతియుత పోరాటం చేసిందని అ‍న్నారు. ప్రజాస్వామ్యంలో నిర‌స‌న‌లు తెలియ‌జేయడం ‍ప్రతిప‌క్షాల హ‌క్కు అని తెలిపారు.

ప్రభుత్వం ప్రజాస్వాయ్యయుతంగా ఉండాలి త‌ప్ప.. నిరంకుశ‌త్వంగా వ్యవహ‌రించ‌రాదని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు కూడా ప‌రిధి దాటి ప్రవర్తిస్తున్నారని అన్నారు. శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేస్తున్న నాయ‌కుల‌ను గృహ‌ నిర్భంధించడాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని అ‍న్నారు. శాంతియుత పోరాటాల‌ను అడ్డుకోవ‌డం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాల‌న సాగిస్తోందని దుయ్యబట్టారు.

దీనిని ప్రజాస్వామ్యవాదులంతా గ‌మ‌నించాల‌ని విజ్ఞప్తి చేశారు. కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నదే కొలువుల కోసమని, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా కొలువులు మాత్రం రావ‌డం లేదని మండిపడ్డారు. పోలీసులు లాఠీఛార్జీ చేసినంత‌ మాత్రాన తమ నిర‌స‌న‌లు ఆగుతాయ‌నుకుంటే అది పొర‌పాటేనని అన్నారు. తుపాకులు, మ‌ర‌ఫిరంగులు ఎక్కుపెట్టిన బ్రిటీష్ సామ్రాజ్యాన్నే ఎదిరించి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యాల కోసం, సిద్దాంతాల కోసం ముందుకు పోతూనే ఉంటుందని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top