
మహబూబ్‌నగర్ జిల్లా: జిల్లాకేంద్రానికి చెందిన ఆర్.రాంకోటి, ప్రభావతి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. వీరిలో పెద్ద అమ్మాయి సౌమ్య పెళ్లి అనంతరం గత ఐదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. మూడేళ్లు చికాగోలో ఉండగా రెండేళ్ల నుంచి డల్లాస్‌లో ఉంటున్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి ప్రతి రాఖీ పండుగను ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకొనేవారు.
అయితే ఇప్పుడున్న సాంకేతిక రోజుల్లో డల్లాస్ నుంచి కొరియర్ ద్వారా తమ్ముడికి రాఖీ పంపిస్తోంది. వినయ్‌కుమార్ అక్క సౌమ్య పంపిన రాఖీతోపాటు మరో సోదరి విష్ణుప్రియతో రాఖీ కట్టించుకొని పండుగను సంతోషంగా జరుపుకొంటున్నాడు. అయితే ఈసారి నాలుగు రోజుల ముందే డల్లాస్ నుంచి రాఖీ వచ్చిందని, పండుగ రోజు వీడియో కాల్ ద్వారా అక్కతో మాట్లాడుతూ రాఖీ పండుగను జరుపుకొంటానని వినయ్‌కుమార్ పేర్కొన్నాడు.
తమ్ముడిని మిస్సవుతున్న..
చిన్నప్పటి నుంచి రాఖీ పండుగ అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం డల్లాస్‌లో ఉండడం వల్ల తమ్ముడిని రాఖీ కట్టలేకపోతున్న. రెండేళ్ల క్రితం రాఖీ పండుగ రోజు అక్కడే ఉండి తమ్ముడికి రాఖీ కట్టాను. ఈసారి రాఖీ పండుగ రోజు తమ్ముడిని ఎంతగానో మిస్ అవుతున్నా. కానీ, నేను పంపే రాఖీ తమ్ముడికి అందాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల నుంచి కొరియర్ ద్వారా పంపుతున్న. ఆ రోజు వీడియో కాల్‌లో తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతాను.
– సౌమ్య, ఎన్‌ఆర్‌ఐ (డల్లాస్)