
నేడు రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోటల సందర్శన
సాక్షి ప్రతినిధి, వరంగల్: చారిత్రక నగరం ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణులు బుధవారం పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్ నగరంలో నాలుగున్నర గంటలు గడపనున్నారు. రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోటను వారు సందర్శించనున్నారు.
హైదరాబాద్ నుంచి సాయంత్రం 4:35 గంటలకు 22 మంది బృందం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 5:45 గంటలకు చారిత్రక వేయి స్తంభాల దేవాలయానికి చేరుకుని అక్కడి కార్యక్రమాల అనంతరం 6:40 గంటలకు వరంగల్ కోటకు చేరుకొని శిల్పాలను సందర్శించి వాటి విశిష్టతలను తెలుసుకుంటారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
రామప్పకు మరో బృందం: 35 మంది సుందరీమణుల మరో బృందం సాయంత్రం 5:15 గంటలకు ములుగు జిల్లా రామప్పకు చేరుకుని అక్కడి హరిత హోటల్‌లో కొద్దిసేపు సేదదీరి సంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాశస్త్యం, కాకతీయుల చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు.

హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ పోలీస్ కమిషనర్‌లు ప్రావీణ్య, సత్యశారద, సన్‌ప్రీత్‌సింగ్‌లు, వివిధ శాఖల అధికారులు వారం రోజులుగా సమీక్ష లు, ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్‌లు రామప్పలో ఏర్పాట్లు పరిశీలించారు. సుమారు మూడు వేల మంది పోలీసులు మూడంచెల బందోబస్తులో పాల్గొంటున్నారు.