మిల్లర్లు సహకరించకుంటే ఇంటర్మీడియట్‌ గోడౌన్లకు ధాన్యం 

Minister video conference with collectors on grain collection - Sakshi

అధికారులకు మంత్రి గంగుల ఆదేశాలు 

ధాన్యం సేకరణపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య ఉత్పన్నం కాకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ధాన్యం విక్రయాల కోసం రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని, మిల్లుల వద్ద స్టోరేజీ లేని చోట, మిల్లులు సహకరించని చోట తక్షణమే ఇంటర్మీడియట్‌ గోడౌన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా అవసరమైన చోట ఇంటర్మీడియట్‌ గోడౌన్లలో మిల్లర్లతో సంబంధం లేకుండా అన్‌లోడింగ్‌ చేసి రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని స్పష్టం చేశారు.

రైతులు కేంద్రం నిర్దేశించిన ఎఫ్‌ఏక్యూ ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా అవగాహన పెంపొందించాలని కలెక్టర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్‌ఏక్యూ ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని, తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు లేనందున అక్కడి ధాన్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్రాన్స్‌ పోర్ట్‌ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను ఎంచుకొని, అవసరమైన చోట స్థానిక ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని జగ్గయ్యపేట, రాయ్‌ చూర్, బీదర్‌ తదితర ప్రాంతాల్లో సైతం ఇంటర్మీడియట్‌ గోదాంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌ సింగ్, కమిషనర్‌ అనిల్‌ కుమార్, జీఎంలు రాజారెడ్డి, శ్రీనివాసరావులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top