కాళేశ్వరం పనులకు ‘స్టీరింగ్‌ కమిటీ’ | Minister Uttam Orders Fast Track Repairs of Kaleshwaram Barrages: Telangana | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం పనులకు ‘స్టీరింగ్‌ కమిటీ’

Apr 13 2026 1:43 AM | Updated on Apr 13 2026 1:43 AM

Minister Uttam Orders Fast Track Repairs of Kaleshwaram Barrages: Telangana

కన్వీనర్‌గా నీటిపారుదల రంగ నిపుణుడు కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా 

తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు నీటిపారుదల రంగ నిపుణుడు కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా కన్వీనర్‌గా ఉన్నతస్థాయి స్టీరింగ్‌ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

ఈ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమై ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తుందన్నారు. అవసరమైతే తాను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమావేశాల్లో పాల్గొని పురోగతిని సమీక్షిస్తానని ఉత్తమ్‌ వెల్లడించారు. ప్రతిరోజూ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామన్నారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో ఆదివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ ప్రత్యేకంగా సమీక్షించారు.

నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, నీటిపారుదల శాఖా సలహాదారుడు ఆదిత్యదాస్‌నాథ్, జాయింట్‌ సెక్రటరీ కె.శ్రీనివాస్, టన్నెల్‌ నిపుణుడు పరీక్షిత్‌ మెహ్రా, ఈఎన్సీలు రమేశ్‌బాబు, శ్రీనివాస్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అదనపు సంచాలకులు సెల్వబాలన్‌ తదితరులు పాల్గొన్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), విజిలెన్స్‌ కమిషన్‌ వంటి చట్టబద్ధ సంస్థలు ఇప్పటికే మూడు బరాజ్‌ల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక, అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్టు మంత్రి తెలిపారు. ఈ మూడు నిర్మాణాల్లో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. కేఎల్‌ఐఎస్‌ మరమ్మతుల పూర్తి ప్రక్రియలో 2027, 2028 సంవత్సరాలను కీలకంగా పరిగణించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని, అదే సమయంలో మేడిగడ్డలో కొంత భాగాన్నీ పూర్తి చేయగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్త డిజైన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే డిజైన్‌ కన్సల్టెంట్‌గా ఏఎఫ్‌ఆర్‌వై ఇండియాను ఎంపిక చేసి, ఐఐటీ ముంబైతో సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించిందన్నారు. డిజైన్‌ బృందం రాత్రింబవళ్లు పనిచేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

పరీక్షిత్‌ మెహ్రాతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కన్సల్టెంట్లకు సూచించారు. డిజైన్‌ ప్రక్రియకు సంబంధించిన భూబౌతిక, భూసాంకేతిక, మట్టి, హైడ్రాలిక్‌ మోడలింగ్‌ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహిస్తారన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు, డేటా అత్యవసర ప్రాధాన్యంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు అత్యధిక ప్రాధాన్యం 
పుణెలోని కేంద్ర జల మరియు విద్యుత్‌ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) పరీక్షలు, అధ్యయనాల బాధ్యత చూస్తుందని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ పనులను అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్, కేంద్ర జల కమిషన్‌తో సమన్వయం చేసి అవసరమైన అనుమతులు పొందాలని సూచించారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ సిబ్బంది 45 రోజుల పరీక్షల కాలంలో నిరంతరం ప్రాజెక్ట్‌ స్థలాల్లో ఉండాలని ఆదేశించారు.  

శిబిరాలను తక్షణమే పునరుద్ధరించాలి 
ఎల్‌అండ్‌టీ సహా అన్ని సంస్థలు తమ క్యాంపులు, మెస్‌ సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి స్పష్టం చేశారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్‌ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఇసుక తొలగింపు, జీపీఆర్‌ (భూబౌతిక) పరీక్షలు, సైట్‌ సిద్ధం పనులన్నీ ఏజెన్సీల పూర్తి సహకారంతో నిర్వహించబడతాయన్నారు. డిజైనర్లు, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు కలిసి అన్ని పరీక్షలను ప్రత్యక్షంగా వీక్షించాలని, ప్రతి అంశాన్ని సక్రమంగా నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement