విస్తరిస్తున్న ప్రచండ వేసవి | Summers are getting longer and hotter faster than expected | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న ప్రచండ వేసవి

Apr 13 2026 1:27 AM | Updated on Apr 13 2026 1:27 AM

Summers are getting longer and hotter faster than expected

ముందే వస్తోంది.. నెమ్మదిగా వెళ్తోంది  

గత 60 ఏళ్లలో వేసవికాలం నిడివి 30 రోజులు పెరిగింది 

కొన్ని నగరాల్లో మరింత ఎక్కువగా పెరుగుతోంది  

బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ తాజా పరిశోధనలో వెల్లడి  

సాక్షి, స్పెషల్‌ డెస్క్: వేసవి వేడి తీవ్రత పెరగటమే కాదు.. వేసవికాలం కూడా ఏటేటా పెరుగుతోంది. మాడు పగిలే ఎండల రోజులు ఏటేటా ముందుగానే ప్రారంభమై, ఆలస్యంగా ముగుస్తూ, మరింత తీవ్రంగా మారుతున్నాయి. వేసవి రోజుల సంఖ్య 1960 నాటి కంటే 2023 మధ్యలో సుమారు 30 రోజులు పెరి గిందని కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా పరిశోధనలో వెల్లడైంది. భూమధ్య రేఖ కు దగ్గరి దేశాల్లో 6 దశాబ్దాల క్రితంతో పోలిస్తే వేసవి కాలాలు ముందుగానే కాక మరింత ఆకస్మికంగా వస్తున్నాయని, ఎక్కు వ కాలం కొనసాగుతున్నాయని, వేడితీవ్రత ఏటేటా మరింత పెరుగుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాతావరణంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకోవటం వల్ల ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా మారే శారీరక సామర్థ్యాన్ని ఇది దెబ్బతీస్తోంది.  

1990 తర్వాత ఎక్కువ 
ఈ తాజా అధ్యయనం వివరాలు ‘ఎన్విరాన్‌మెంటల్‌ రీసెర్చ్‌ లెటర్స్‌’లో ప్రచురితమయ్యాయి. వేసవి రోజుల సంఖ్య తొలుత భూమిపై పెరిగాయి. ఆ తర్వాత సముద్రంలోనూ పెరిగాయి. 1961–2023 మధ్యకాలంలో, మధ్య అక్షాంశాలలోని భూభాగాలు, తీర ప్రాంతాలు, సముద్రాల్లో ప్రతి సంవత్సరం వేసవికాల వ్యవధి పెరిగింది. తొలి 3 దశాబ్దాల కంటే ఆ తర్వాత మరింత పెరిగింది. 1990–2023 మధ్యలో వేసవి కాలం నిడివి పెరుగుదల సగటు రేటు సుమారుగా దశాబ్దానికి ఆరు రోజులు. అంటే.. 1990తో పోలిస్తే 2023లో వేసవి సుమారు 20 రోజులు ఎక్కువ.  

కొన్ని నగరాల్లో మరీ ఎక్కువ 
వేసవికాలం కొన్ని నగరాల్లో సంవత్సరానికి ఒక రోజు కంటే ఎక్కువగా పెరుగుతోంది. ఉదాహరణకు సిడ్నీ (ఆ్రస్టేలియా)లో ప్రతి దశాబ్దానికి వేసవికాలం 14.8 రోజుల చొప్పున పెరుగుతోంది. అంటే 1990లో 80 రోజులుగా ఉన్న వేసవికాలం ఇప్పుడు సుమారు 130 రోజులకు చేరుకుంది. మిన్నియాపాలిస్‌ (అమెరికా)లో ప్రతి దశాబ్దానికి 9.3 రోజులు, టొరంటో (కెనడా)లో 8 రోజులు పెరుగుతోంది. వేసవిలో వేడి అంతకంతకూ     పెరగడం వల్ల మధ్య అక్షాంశ దేశాల్లోని మనుషుల్లో వేడికి తట్టుకునే శారీరక సామర్థ్యం క్షీణించొచ్చు.

పగలు, రాత్రి వేళల్లో శరీరాన్ని చల్లబరచుకోవడానికి మరింత శక్తి అవసరం కావొచ్చని అధ్యయనం పేర్కొంది. ఈ పెరిగే వేసవి తీవ్రత ప్రతికూల ప్రభావం పంటలపై కూడా ఉంటుంది. వసంతకాలం నుంచి వేసవికి, వేసవి నుంచి శరదృతువుకు వాతావరణం మారే దశల్లో వేగం పెరిగింది. దీంతో, వేసవి వేడి తీవ్రత కూడా పెరుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ మార్పులపై ఆధారపడిన వ్యవస్థలకు సర్దుబాటు చేసుకోవడానికి సమయం తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ప్రజలు అధిక ఉష్ణోగ్రతలకు ఇంకా అలవాటు పడని సీజన్‌ ప్రారంభ రోజుల్లోనే ప్రాణాంతకమైన వడగాలులకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement