సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొన్ని పత్రికలు, చానెల్స్.. రాజకీయ కుట్రతో తప్పుడు కథనాలు ఇస్తున్నాయని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్‌లోని గిద్దె పెరుమాళ్ళ స్వామి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలో భాగంగా మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు చట్టం తన పని తాను చేస్తుంది. దీని వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదు. మహిళలను, మహిళా అధికారులను, మహిళా జర్నలిస్టులను అవమానపరిచేలా కథనాలు ఇవ్వడం సరికాదు. దమ్ముంటే ఆధారాలతో బయటపెట్టాలి.
మా ప్రభుత్వం రాకముందు కూలిపోయిన కాళేశ్వరం కూడా మేమే పేల్చామని అబద్ధం ప్రచారం చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉపాధి హామీ పథకాన్ని వెనుకేసుకొచ్చేలా మాట్లాడటం సరికాదు. జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం, ఉపాధి హామీ పథకానికి గండిపడేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చెపడుతాం’ అని హెచ్చరించారు.


