ఫలితాల మరుసటి రోజే  మిమ్మల్ని కలుస్తా! | Minister KTR Inspiring Speech To Youth | Sakshi
Sakshi News home page

ఫలితాల మరుసటి రోజే  మిమ్మల్ని కలుస్తా!

Published Tue, Nov 21 2023 4:41 AM | Last Updated on Tue, Nov 21 2023 4:41 AM

Minister KTR Inspiring Speech To Youth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున డిసెంబర్‌ నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో యువతతో సమావేశమవుతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు హామీనిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు తాము భరోసాగా ఉంటామని ప్రకటించారు. పలు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కొందరు విద్యార్థులు సోమవారం కేటీఆర్‌తో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన సుమారు రెండు గంటల పాటు విస్తృతంగా సంభాషించారు.

నోటిఫికేషన్ల ఫలితాల జారీపై ఉన్న కేసుల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని, యువత ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. పదేళ్ల పాటు ఉద్యోగం చేసిన యువకుడిగా, సోదరుడిగా యువత ఆకాంక్షలను అర్ధం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తు తం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా వివరించారు. 

మా నిబద్ధతను ప్రశ్నించే అవకాశం లేదు 
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ప్రశ్నించే అవకాశం ఎవరికీ లేదని కేటీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా వేయి ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్‌ పార్టీకి తమను ప్రశ్నించే కనీస అర్హత లేదన్నారు. 2లక్షల30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే 1,62,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.

రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తే లెక్కలతో సహా వివరించాలని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం చేస్తున్న అసత్య పూరిత ప్రచారాన్ని యువత తెలుసుకుని తిప్పికొట్టాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

పోస్టుల సంఖ్యను పెంచండి  
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వల్ల యువతలో కొంత ఆందోళన నెలకొందని కేటీఆర్‌తో భేటీ అయిన యువకులు తెలిపారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ, రోస్టర్‌ పాయింట్ల కేటాయింపు, విద్య అర్హతల విషయంలో ఉన్న కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం ఉందంటూ ఇందుకు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలను అందించారు.

కేవలం సాంకేతికపరమైన అంశాల ఆధారంగా అనేక న్యాయపరమైన కేసులు ఎదురవుతున్నాయని, వీటి వలన భర్తీ ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని చెప్పుకొచ్చారు. ఇందుకు కేటీఆర్‌ సానుకూలంగా స్పందిస్తూ, వివిధ నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ పై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement