ఆ ఐదు జిల్లాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందిలో ఆందోళన
చలాన్ల అక్రమాల్లో తాఖీదులొస్తాయేమోనని టెన్షన్
విచారణ కమిటీలో ఏసీబీ ఉండడంతో ఆందోళన
గతంలో, ఇప్పుడు లావాదేవీల్లో ఎక్కడైనా తేడాలు వచ్చాయా అనే సమాచారం సేకరణ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కేసు పలుజిల్లాల తహసీల్దార్లను వణికిస్తోంది. తమకు నోటీసులు వస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2021 –2025 మధ్య కాలంలో జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పని చేసిన తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బందిలో టెన్షన్ నెలకొంది. ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ఏసీబీ అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో.. తమకు నోటీసులు తప్పవనే భావనలో తహసీల్దార్లు ఉన్నారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.
ఈ కేసు విచారణలో భాగంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు నిర్వహించిన అనేకమంది రైతులకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరమైన లావాదేవీల్లో అక్రమాలు జరగడం, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితుల్లో మండల రెవెన్యూ అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న ఆడిట్‌లో భాగంగా.. తాము గతంలో పనిచేసిన కార్యాలయాల్లో జరిగిన లావాదేవీల్లో తేడాలేమైనా వచ్చాయా అనే కోణంలో తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం తాము పనిచేస్తున్న చోట్ల తమకు తెలియకుండా జరిగిన ఏవైనా అక్రమాలు బయటకు వస్తాయోమేననే ఆందోళనా వ్యక్తమవుతోంది.
పండుగ తర్వాత రంగంలోకి ఏసీబీ..?
ఈ కేసుకు సంబంధించి సాంకేతిక, నేర పూరిత అక్రమాలకు సంబంధించిన ఆధారాలను రాబట్టడంలో ప్రభుత్వం నియమించిన కమిటీ నిమగ్నమైంది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పోలీసుల విచారణ ఓవైపు, సాంకేతిక ఆధారాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధరణి, భూభారతి లావాదేవీల ఆడిటింగ్ మరోవైపు జరుగుతున్నాయి. ఈ విచారణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత లభించే సమాచారాన్ని బట్టి సంక్రాంతి పండుగ తర్వాత ఏసీబీ రంగంలోకి దిగుతుందని, అప్పుడు అసలు విచారణ ప్రారంభమవుతుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.
కలెక్టర్లకు నివేదికలు..
సాంకేతిక ఆధారాల సమీకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడిటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ ఆడిటింగ్‌లో తేడా వచ్చిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం నుంచి తహశీల్దార్లకు పంపారు. ఈ లావాదేవీల విషయంలో ఏం జరిగిందనే వివరాలు పంపాలని కోరగా, తహశీల్దార్లు ఆ మేరకు తమ జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపినట్టు తెలిసింది.
కాగా కలెక్టర్లు ప్రతి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి లావాదేవీ వారీగా వివరాలను ధ్రువీకరించుకుంటూ 90 శాతానికి పైగా లావాదేవీల వివరాలను తిరిగి సీసీఎల్‌ఏ కార్యాలయానికి పంపినట్టు సమాచారం. రెండు చలాన్లు, క్యాన్సిలేషన్ డీడ్‌ల విషయంలో అంతా సవ్యంగానే ఉందని, అక్కడక్కడా చిన్న చిన్న తేడాలు మినహా ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టే స్థాయిలో ఈ రెండు లావాదేవీల్లో అక్రమాలు జరగలేదని తహశీల్దార్లు, కలెక్టర్ల ద్వారా సీసీఎల్‌ఏకు నివేదించినట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.


