రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్‌వ్యవస్థీకరణకు సర్కారు నిర్ణయం
ప్రస్తుత స్థితిలో మార్పు చేస్తే పలు
విషయాల్లో ప్రభావం పడే అవకాశం
ప్రధానంగా స్థానికత అంశంలో మరింత గందరగోళం నెలకొనే పరిస్థితి
మారనున్న స్థానికత ఆధారంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపులు
పదేళ్లయినా ఇప్పటికీ కొలిక్కిరాని ఉద్యోగుల కేటాయింపు సమస్యలు
పునర్‌వ్యవస్థీకరణతో మరింత అయోమయానికి దారితీసే అవకాశం
ఇప్పుడున్న మల్టీజోన్లు, జోన్లలోనూ మార్పులు అనివార్యం
పునర్‌వ్యవస్థీకరణ చేస్తే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ అంశం ఇప్పుడు అన్నివర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలు, మండలాల పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడమే దీనికి కారణం. ఉద్యోగాల సాధన కోసం కసరత్తు చేస్తున్న నిరుద్యోగులతోపాటు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, స్థానిక రాజకీయ నాయకులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏవిధంగా ఉంటుందనే సందేహం కొందరిలో ఉంటే... ఈ తంతు ఎలాంటి సమస్యలకు దారితీస్తుందోననే ఆందోళన మరికొందరిలో వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని 10 జిల్లాలను అప్పటి ప్రభుత్వం 33 జిల్లాలకు పెంచింది.
తొలుత 31 జిల్లాలుగా ఏర్పాటు చేసిన అనంతరం మరో రెండు జిల్లాలను కలిపి జిల్లాల సంఖ్యను 33కు పెంచింది. అలాగే, రెవెన్యూ డివిజన్లు 74కు పెరగగా, రెవెన్యూ మండలాల సంఖ్య 612కు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వం 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా వర్గీకరించింది. ఈమేరకు రాష్ట్రపతి ఆమోదంతో 2018 ఆగస్టు నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ విభాగాల విభజన, ఉద్యోగుల కేటాయింపులు, స్థానికత నిర్ధారణ, ఉద్యోగ నియామకాలు... ఇలా పలురకాల అంశాల్లో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఐదేళ్లు పట్టగా... ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్యలు, స్థానికతకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ తరుణంలో కొత్తగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ, మండలాల హేతుబద్ధీకరణ అంశాలు తెరపైకి రావడం గమనార్హం.
మార్పుచేర్పులు చేసినా...
జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపు లేదా తగ్గింపు అని అనను’అని పేర్కొన్నారు. సంఖ్యాపరంగా మార్పు ఉండదని చెప్పినప్పటికీ.. జనాభా ప్రాతిపదికన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను హేతుబద్దీకరిస్తామని స్పష్టంచేశారు. దీంతో జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం ప్రకటన ఆచరణలోకి వస్తే ముందుగా తెరపైకి వచ్చేది స్థానికత అంశమే. ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించినదే కాదు. నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అందరికీ సంబంధించింది.
ఈ నిర్ణయంతో పాలన పరంగా మార్పులు చోటుచేసుకోవడంతోపాటు ఉద్యోగుల కేటాయింపులు, కొత్తగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జోనల్, మల్టీజోనల్ పరిధుల్లో మార్పులు అనివార్యమవుతాయి. దీనికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అవుతుంది. నిరుద్యోగులతోపాటు విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థల ప్రాంతాల వారీగా స్థానికత ఖరారు చేయాలి. ఈ స్థానికతే తదుపరి చదువులకు, ఉద్యోగాలకు అవసరమవుతుంది. స్థూలంగా చూస్తే ఏమాత్రం మార్పులు చేసినా అది అన్ని విభాగాల్లోనూ ప్రభావం చూపుతుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఎడతెగని పంచాయితీ...
రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రాకముందు కేవలం రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్ల సంఖ్య 7కు పెరగగా... కొత్తగా మల్టీజోన్లను ఏర్పాటు చేశారు. జోన్ల సంఖ్య పెంపుతో విద్యార్థులు, ఉద్యోగుల స్థానికతలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జీఓ 317 జారీ చేసింది. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సీనియార్టీని ముందు వరుసలోకి తీసుకోవడంతో మెజార్టీ ఉద్యోగులు జిల్లాలు మారిపోయారు. దాదాపు 30 శాతం మంది సొంత ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు కేటాయించబడ్డారు. ప్రధానంగా జిల్లా కేడర్ ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో టీచర్లతోపాటు పోలీస్ కానిస్టేబుల్స్ ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
⇒ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆన్‌లైన్‌లో ఆర్జీలను స్వీకరించింది. ఏకంగా 1.5 లక్షల మంది ఆర్జీలు పెట్టుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో కొన్నింటిని పరిష్కరించినా... మరికొందరికి తాత్కాలిక పద్ధతిలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం డెప్యూటేషన్ పద్ధతిని ఎంచుకుంది. కానీ ఈ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. మరోవైపు ఉద్యోగ కేటాయింపులతో పట్టణ ప్రాంత జిల్లాల్లో ఖాళీలు లేకుండాపోగా... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంత అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియతో ఈ సమస్యలన్నీ పునరావృతమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.


