breaking news
reorganization districts
-
మళ్లీ.. కొత్త జిల్లాల లొల్లి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ అంశం ఇప్పుడు అన్నివర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడమే దీనికి కారణం. ఉద్యోగాల సాధన కోసం కసరత్తు చేస్తున్న నిరుద్యోగులతోపాటు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, స్థానిక రాజకీయ నాయకులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏవిధంగా ఉంటుందనే సందేహం కొందరిలో ఉంటే... ఈ తంతు ఎలాంటి సమస్యలకు దారితీస్తుందోననే ఆందోళన మరికొందరిలో వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని 10 జిల్లాలను అప్పటి ప్రభుత్వం 33 జిల్లాలకు పెంచింది. తొలుత 31 జిల్లాలుగా ఏర్పాటు చేసిన అనంతరం మరో రెండు జిల్లాలను కలిపి జిల్లాల సంఖ్యను 33కు పెంచింది. అలాగే, రెవెన్యూ డివిజన్లు 74కు పెరగగా, రెవెన్యూ మండలాల సంఖ్య 612కు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వం 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా వర్గీకరించింది. ఈమేరకు రాష్ట్రపతి ఆమోదంతో 2018 ఆగస్టు నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ విభాగాల విభజన, ఉద్యోగుల కేటాయింపులు, స్థానికత నిర్ధారణ, ఉద్యోగ నియామకాలు... ఇలా పలురకాల అంశాల్లో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఐదేళ్లు పట్టగా... ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్యలు, స్థానికతకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ తరుణంలో కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల హేతుబద్ధీకరణ అంశాలు తెరపైకి రావడం గమనార్హం. మార్పుచేర్పులు చేసినా... జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపు లేదా తగ్గింపు అని అనను’అని పేర్కొన్నారు. సంఖ్యాపరంగా మార్పు ఉండదని చెప్పినప్పటికీ.. జనాభా ప్రాతిపదికన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను హేతుబద్దీకరిస్తామని స్పష్టంచేశారు. దీంతో జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం ప్రకటన ఆచరణలోకి వస్తే ముందుగా తెరపైకి వచ్చేది స్థానికత అంశమే. ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించినదే కాదు. నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అందరికీ సంబంధించింది. ఈ నిర్ణయంతో పాలన పరంగా మార్పులు చోటుచేసుకోవడంతోపాటు ఉద్యోగుల కేటాయింపులు, కొత్తగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జోనల్, మల్టీజోనల్ పరిధుల్లో మార్పులు అనివార్యమవుతాయి. దీనికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అవుతుంది. నిరుద్యోగులతోపాటు విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థల ప్రాంతాల వారీగా స్థానికత ఖరారు చేయాలి. ఈ స్థానికతే తదుపరి చదువులకు, ఉద్యోగాలకు అవసరమవుతుంది. స్థూలంగా చూస్తే ఏమాత్రం మార్పులు చేసినా అది అన్ని విభాగాల్లోనూ ప్రభావం చూపుతుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎడతెగని పంచాయితీ... రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రాకముందు కేవలం రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్ల సంఖ్య 7కు పెరగగా... కొత్తగా మల్టీజోన్లను ఏర్పాటు చేశారు. జోన్ల సంఖ్య పెంపుతో విద్యార్థులు, ఉద్యోగుల స్థానికతలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జీఓ 317 జారీ చేసింది. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సీనియార్టీని ముందు వరుసలోకి తీసుకోవడంతో మెజార్టీ ఉద్యోగులు జిల్లాలు మారిపోయారు. దాదాపు 30 శాతం మంది సొంత ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు కేటాయించబడ్డారు. ప్రధానంగా జిల్లా కేడర్ ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో టీచర్లతోపాటు పోలీస్ కానిస్టేబుల్స్ ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ⇒ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్లో ఆర్జీలను స్వీకరించింది. ఏకంగా 1.5 లక్షల మంది ఆర్జీలు పెట్టుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో కొన్నింటిని పరిష్కరించినా... మరికొందరికి తాత్కాలిక పద్ధతిలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం డెప్యూటేషన్ పద్ధతిని ఎంచుకుంది. కానీ ఈ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. మరోవైపు ఉద్యోగ కేటాయింపులతో పట్టణ ప్రాంత జిల్లాల్లో ఖాళీలు లేకుండాపోగా... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంత అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న పునర్వ్యవస్థీకరణ ప్రక్రియతో ఈ సమస్యలన్నీ పునరావృతమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అధికారిక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 – 26కు పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాల పునర్విభజన ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ (ఎస్ఎల్సీ), వివిధ అంశాలపై అధ్యయనం కోసం నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వీటికి సహకరించేందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలను నియమించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం జీవో జారీ చేశారు. ఎస్ఎల్సీ బాధ్యతలివీ.. ► ఎస్ఎల్సీ కోసం ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎస్ఎస్)లో సచివాలయం ఏర్పాటు కానుంది. ► సబ్ కమిటీల నుంచి ఎస్ఎల్సీ సమాచారం õసేకరించి జిల్లా పునర్వ్యవస్థీకరణ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. జీఐఎస్ మ్యాపులు లాంటివి సమకూర్చాలి. జిల్లా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరిగిన ప్రాంతాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి డేటా తెప్పించుకోవాలి. ► నిపుణులు, ఏజెన్సీలు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవచ్చు. ఎస్ఎల్సీ సచివాలయం ప్రాథమికంగా ఆరు నెలలు కొనసాగుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు. నాలుగు సబ్ కమిటీల విధులివీ.. ► జిల్లాల సరిహద్దులు, న్యాయ పరమైన అంశాల అధ్యయన బాధ్యతలను మొదటి ఉప సంఘం పర్యవేక్షిస్తుంది. ► ప్రస్తుత పరిస్థితి/ సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను రెండో సబ్ కమిటీ నిర్వర్తిస్తుంది. ► ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయన బాధ్యతలను మూడో సబ్ కమిటీ నిర్వహిస్తుంది. ► ఐటీ/ సాంకేతిక అంశాల అధ్యయన బాధ్యతలను నాలుగో సబ్ కమిటీ చేపడుతుంది. జిల్లా కమిటీల్లో ఉండేది వీరే.. ► కలెక్టరు అధ్యక్షతన పనిచేసే డీఎల్‌సీకి జాయింట్ కలెక్టర్ (జేసీ, రైతు భరోసా, రెవెన్యూ) సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఎస్పీ, జిల్లా విద్యా శాఖాధికారి, వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పరిషత్ సీఈవో, ముఖ్య ప్రణాళికాధికారి, ట్రెజరీ ఆఫీసర్, కలెక్టరు ప్రతిపాదించిన అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ► అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు/ విభాగాధిపతులు ఎస్ఎల్సీ సమావేశాలకు హాజరై సమాచారాన్ని సకాలంలో అందించాలని సీఎస్‌ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కొత్త విజ్ఞప్తులు స్వీకరించొద్దు
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి వచ్చిన ప్రతీ విజ్ఞప్తిని క్షుణ్నంగా పరిశీలించి తుది నోటిఫికేషన్ ఇచ్చినందున జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులకు స్పష్టత ఇచ్చారు. తుది నోటిఫికేషన్ ప్రకారం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యాయని, దీని ప్రకారమే పాలన జరుగుతుందని, ఇంకా మార్పులు చేర్పులకు ఏ మాత్రం అవకాశం లేదని, ఏవైనా విజ్ఞప్తులు వచ్చినా స్వీకరించొద్దని ఆయన ఆదేశించారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. దాదాపు ఏడాది పాటు వివిధ స్థాయిల్లో అత్యంత లోతుగా చేసిన కసరత్తు ఫలితంగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, పోలీసు కమిషనరేట్లు, పోలీస్ సబ్-డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల కూర్పు అద్భుతంగా జరిగిందని అభిప్రాయపడ్డారు. ఇక మరింత బాగా పనిచేసే అంశాలపై దృష్టిపెట్టాలని సీఎస్ కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు.


