సాక్షి, హైదరాబాద్: ఓ కథనానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసిన ఎన్‌టీవీ జర్నలిస్టులకు 14వ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు చేసిన ఎన్‌టీవీ జర్నలిస్టులను హైదరాబాద్ పోలీసులు ఇన్‌ఛార్జ్ 14వ ఏసీఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఓ కథనానికి సంబంధించిన కేసులో ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిలో ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్ లు దొంతు రమేష్, సుధీర్ లను బషీర్ బాగ్ సీసీ ఎస్ నుంచి మణికొండలోని ఇన్‌ఛార్జ్ 14వ ఏసీఎంఎం మేజిస్ట్రేట్ వద్దకు సిసిఎస్ పోలీసులు తరలించి హాజరుపరిచారు. కేసుకి సంబంధించి మేజిస్ట్రేట్ ముందు వాదనలు కొనసాగాయి. వాదనలను విన్న మేజిస్ట్రేట్ జర్నలిస్టులకు రిమాండ్ విధించాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించారు.
జర్నలిస్టుల అరెస్టులను జర్నలిస్టు సంఘాలతోపాటు పలువురు రాజకీయ నేతలు ఖండించారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేశారని, జర్నలిస్టులను నేరస్తుల్లా చూడటం దురదృష్టకరమని, వారి పట్ల వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.


