ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో 

Minister KTR at the inauguration of LB Nagar flyover - Sakshi

నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌కు.. అక్కడి నుంచి హయత్‌నగర్‌కు కూడా.. 

ఎల్బీనగర్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ 

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమే 

ఏడాదిన్నరలోపే ‘టిమ్స్‌’ పూర్తి 

నెలాఖరులోగా జీవో 118 లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

వనస్థలిపురం (హైదరాబాద్‌):  ‘తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రోరైల్‌ సేవలను ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు విస్తరిస్తాం. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రోను అనుసంధానిస్తాం. అంతేకాదు ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోరైల్‌ను నిర్మిస్తాం’ అని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు.

ఎల్బీనగర్‌ చౌరస్తా నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన భారీ ఫ్లైఓవర్‌ను శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రోగ్రామ్‌ (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా రూ.658 కోట్లతో 12 ప్రాజెక్టులు చేపడితే.. ఇప్పటివరకు తొమ్మిది ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని కేటీఆర్‌ చెప్పారు.

బైరామల్‌గూడలో పెండింగ్‌లో ఉన్న మూడు ప్రాజెక్టులను కూడా సెపె్టంబర్‌లోపు పూర్తి చేస్తామని.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళతామని పేర్కొన్నారు. గతంలో ఎల్బీనగర్‌ చౌరస్తా దాటాలంటే కనీసం పది పదిహేను నిమిషాలు పట్టేదని.. ఇప్పుడా సమస్య తీరిందని చెప్పారు. 

పేదలకు పట్టాలిస్తాం.. 
హైదరాబాద్‌లో ఏడాదిన్నర కాలంలో వెయ్యి పడకల సామర్థ్యంతో టిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇక 118 జీవో కింద దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెలాఖరులోగా పట్టాలు పంపిణీ చేస్తామని.. ఈ జీవో పరిధిలోకి రాని కాలనీలను కూడా త్వరలో దీని పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు.

జీవోలు 58, 59 కింద ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో 1.28 లక్షల మందికి నివాస పట్టాలు ఇచ్చామని.. మిగతా పేదలకు కూడా పట్టాలిచ్చే బాధ్యత తమదేనని ప్రకటించారు. ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీల కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 

ఎల్బీనగర్‌ బీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు 
ఒకవైపు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలోనే.. మరోవైపు పార్టీ లో అంతర్గత వర్గపోరు బయటపడింది. బీఆర్‌ఎస్‌కు చెందిన చంపాపేట మాజీ కార్పొరేటర్‌ రమణారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వర్గీయులు రమణారెడ్డిపై దాడికి యత్నించగా ఆయన, ఆయన వర్గీయులు పరుగులు తీశారు. చివరికి పోలీసులు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

ఈ కార్యక్రమం అనంతరం గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి ఓటమిపాలైన ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో గెలిచి, బీఆర్‌ఎస్‌లో చేరాక.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. పా ర్టీ లోని అసలైన ఉద్యమకారులు, సీనియర్లపై ఎమ్మెల్యే పెయిడ్‌ ఆరి్టస్టులు, గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

ఎల్బీనగర్‌ జంక్షన్‌కు శ్రీకాంతాచారి పేరు 
ఎల్బీనగర్‌ జంక్షన్‌కు తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని.. ఫ్లైఓవర్‌కు మాల్‌ మైసమ్మ పేరు పెడతామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లే కాకుండా ప్రజారవాణా బాగా మెరుగుపడాల్సి ఉందన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top