వర్షాల వల్ల ప్రాణనష్టం జరగొద్దు 

Minister KTR Directed Officials Over To Prevent Loss Of Life Due To Rains - Sakshi

అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వర్షాల కారణంగా పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. బుధవారం ప్రగతిభవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు.

భారీ వర్షాల వల్ల ప్రభావితమైన హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ప్రమాదకరంగా ఉన్న అలాంటి కట్టడాలను తొలగించే చర్యలు కొనసాగించాలని సూచించారు.

కల్వర్టులు, బ్రిడ్జిలను పరిశీలించి ప్రమాదకరమైన చోట్ల హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌ నగరం, పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి అధికారులు కలసి వరద నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అన్ని పురపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top