హలో సీఎం సార్‌.. నేను హరీశ్‌ను  | Minister Harish Rao Phone Call To CM KCR About Farmers | Sakshi
Sakshi News home page

హలో సీఎం సార్‌.. నేను హరీశ్‌ను 

Published Mon, Mar 22 2021 4:40 AM | Last Updated on Mon, Mar 22 2021 1:17 PM

Minister Harish Rao Phone Call To CM KCR About Farmers - Sakshi

సాక్షి, గజ్వేల్‌: ‘హలో.. సీఎం సార్‌.. నేను హరీశ్‌ను మాట్లాడుతున్నా.. సిద్దిపేట జిల్లా కొడకండ్లలో కాళేశ్వరం కాల్వ వద్ద ఉన్న కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు వదలాలని రైతులు కోరుతుండ్రు. ఎండలు ముదరడం వల్ల ఈ వాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి 11 వేల ఎకరాల్లో వరిపంట పొట్టకొచ్చే దశలో ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. మీరు అనుమతిస్తే కొడకండ్ల కాల్వ నుంచి గోదావరి జలాలు వదిలి కూడవెల్లి వాగును నింపుతాం. రోజుకు 500 క్యూసెక్కుల నీటిని వాగులోకి పంపే అవకాశముంటుంది.

దీని ద్వారా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో 36 చెక్‌డ్యామ్‌లు నిండే అవకాశంతో పాటు, భూగర్భ జలమట్టం పెరగడం ద్వారా బోరుబావులు పుష్కలంగా నీరు పోసే అవకాశం ఉంటుంది. దీంతో పంటలు దక్కుతాయి..’ఇదీ సీఎం కేసీఆర్‌కు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఫోన్‌ ద్వారా చేసిన విజ్ఞప్తి. ఈ వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘హరీశ్‌ గో ఏహెడ్‌... రైతుల పంటలు కాపాడడమే మన ప్రభుత్వ లక్ష్యం. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయండి. వెంటనే కాల్వల ద్వారా కూడవెల్లిలోకి నీళ్లు వదలండి.. అంటూ ఆదేశించారు. అలాగే గజ్వేల్‌ కాల్వ ద్వారా చేబర్తి పెద్ద చెరువును నింపి పైన ఉన్న కూడవెల్లి వాగు మిగతా భాగంలోకి గోదావరి జలాలను తరలించాలని సూచించారు.  
(చదవండి: ఉద్యోగులకు పీఆర్‌సీ 30శాతం!)

11 వేల ఎకరాల్లో వరికి ఊపిరి 
సమస్య చెప్పిందే తడవుగా తమ సమక్షంలోనే సీఎంకు ఫోన్‌ చేసి అక్కడికక్కడే పరిష్కారానికి మంత్రి హరీశ్‌ చొరవ చూపడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీశ్‌కు కూడవెల్లి వాగు పరీవాహక ప్రాంతం రైతులు తమ సమస్య వివరించారు. తక్షణమే స్పందించిన ఆయన కొడకండ్ల వద్ద ఉన్న కాళేశ్వరం కాలువ నుంచి కొడకండ్ల చెక్‌ డ్యామ్‌ ద్వారా కూడవెల్లి వాగు నింపే అవకాశముందని తెలుసుకొని, హుటాహుటిన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర నేతలు, అధికారులతో కలసి అక్కడికి వెళ్లారు.

ఫోన్‌ ద్వారా సమస్యను సీఎంకు వివరించారు. కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మంగళవారం ఉదయం నీటి విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా జగదేవ్‌పూర్‌ మండలంలో 7, గజ్వేల్‌ మండలంలో 7, తొగుటలో 8, మిరుదొడ్డిలో 10, దుబ్బాకలో 5 చెక్‌డ్యామ్‌లు పూర్తిగా నిండనున్నాయి. ఫలితంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని కూడవెల్లి పరీవాహక ప్రాంతంలో కుడి, ఎడమవైపు ఉన్న 11 వేల ఎకరాల్లో వరిపంట దక్కే అవకాశం కలిగింది.   
' (చదవండి: నాణ్యమైన బియ్యానికి.. చెల్లిన 'నూకలు')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement