అవయవ మార్పిడికి నజరానా

Minister Harish Rao At Adilabad Rims Super Speciality Hospital - Sakshi

బోధనాస్పత్రులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తాం: హరీశ్‌రావు 

డాక్టర్లు, సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తాం 

వైద్యంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలుద్దామని పిలుపు 

ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించిన మంత్రి

సాక్షి, ఆదిలాబాద్‌/నిర్మల్‌:  రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్స చేస్తే.. సదరు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు అందజేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలు చేయడంపై వైద్యులు దృష్టి సారించాలని.. వైద్య పరికరాలు, మందులు ఇతర అవసరాలను సమకూర్చుకునేందుకు నిధులు ఇస్తామని తెలిపారు. సదరు డాక్టర్లకు, పనిచేసే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. కష్టపడి పనిచేయాలని సూచించారు.

పేదలకు వైద్యం అందించడంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని.. నంబర్‌ వన్‌గా నిలిపేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం రాత్రి బాసరలో బసచేశారు. గురువారం ఉదయమే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

తర్వాత ముధోల్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి, నిర్మల్‌లో నిర్మించనున్న 250 పడకల జిల్లా ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. సాయంత్రం ఆదిలాబాద్‌లో రూ.150 కోట్లతో నిర్మించిన రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు.

ఏడేళ్లలో 17 మెడికల్‌ కాలేజీలు: దేశంలో పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మనదేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరవై ఏళ్లపాటు కొనసాగిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మూడే మెడికల్‌ కాలేజీలు వచ్చాయని.. ఏడేళ్ల స్వరాష్ట్ర పాలనలో ఏకంగా 17 ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

అప్పట్లో వరంగల్‌లో రైతులు బస్తాకు రూపాయి చొప్పున జమ చేసుకుని ఆస్పత్రి కట్టుకుంటే.. తర్వాత సమైక్య పాలకులు దానిని మెడికల్‌ కాలేజీగా మార్చారన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల పనితీరుపై నెలనెలా సమీక్షిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. ఇక సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఈ నెల 5న హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌కార్డు అందిస్తామన్నారు.

దేశం మెచ్చుకుంటుంటే.. ఇక్కడ విమర్శలు 
కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు దారుణమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో తెలంగాణ ఇంటింటి సర్వే చేసి ఉత్తమ ఫలితాలు సాధించిన తీరును నీతి ఆయోగ్‌ ప్రశంసించిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌ లో బస్తీ దవాఖానాల ఏర్పాటును 15వ ఆర్థిక సంఘం మె చ్చుకుందని తెలిపారు. ఈ రెండింటినీ మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్న సూచనలు చేశాయని వివరించారు.

సొంత జాగా ఉంటే ఇల్లు
సొంత జాగా ఉన్న పేదలు ఇల్లు కట్టుకునేందుకు వీలుకల్పించే కార్యక్రమంపై సీఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నా రని హరీశ్‌రావు తెలిపారు. 57 ఏళ్లు దాటినవారికి పింఛన్‌ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్‌ బాపురావు, రేఖా శ్యాంనాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top