హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడి... మరో రూ. 16వేల కోట్లు!  | Microsoft Plans Three More Data Centres In Telangana With 16000 crores | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడి... మరో రూ. 16వేల కోట్లు! 

Jan 20 2023 2:39 AM | Updated on Jan 20 2023 2:41 AM

Microsoft Plans Three More Data Centres In Telangana With 16000 crores - Sakshi

మైక్రోసాఫ్ట్‌ ఆసియా హెడ్‌ అహ్మద్‌ మజారీతో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. గత సంవత్సరం ప్రారంభంలో రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో ఒక్కోటీ సగటున 100 మెగావాట్ల ఐటీలోడ్‌ (సర్వర్లు, నెట్‌వర్క్‌ పరికరాలు వినియోగించిన లేదా వాటి కోసం కేటాయించే విద్యుత్‌ మొత్తం)తో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌ తాజాగా దావోస్‌ వేదికగా మరో 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన 3 డేటా సెంటర్ల ఏర్పాటుకు మరో రూ. 16 వేల కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొత్తంగా 6 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే 10–15 ఏళ్లలో ఈ డేటా సెంటర్లు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయని పేర్కొంది. క్లౌడ్‌ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకే ఈ భారీ పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వివరించింది. 

మైక్రోసాఫ్ట్‌తో బంధం బలోపేతం: కేటీఆర్‌ 
రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్‌ అడాప్షన్‌ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో కలసి పనిచేస్తున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 డేటా సెంటర్లు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం సంతోషకరమన్నారు.

తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్‌ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ ఆసియా హెడ్‌ అహ్మద్‌ మజారీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్‌లో హైదరాబాదే కీలకమని, భవిష్యత్తులోనూ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. భారత్‌ కేంద్రంగా తమ సంస్థ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు కీలకంగా మారతాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement