విన్యాసాల వాయిద్యం.. మార్ఫా సంగీతం.. | Marfa music at every celebration in the city | Sakshi
Sakshi News home page

విన్యాసాల వాయిద్యం.. మార్ఫా సంగీతం..

Jun 15 2025 2:09 AM | Updated on Jun 15 2025 2:09 AM

Marfa music at every celebration in the city

ఆఫ్రో, అరబ్‌ సంప్రదాయం నుంచి హైదరాబాద్‌కు 

మిస్‌ వరల్డ్‌ పోటీదారులను ఆకట్టుకున్న మ్యూజిక్‌ 

బారాత్‌లలో రహదారులపై విన్యాసం 

గోల్కొండ కోటలో వేడుకలకు నేపథ్యం 

నగర చరిత్రతో శతాబ్దాలుగా మమేకం 

మార్ఫా సంగీతం.. ఓ సంప్రదాయ సంబరం..

గణేష్‌ చతుర్థి ఊరేగింపులైనా.. పెళ్లి వేడుకలైనా.. నగరాన్ని సందర్శించే ప్రముఖులను స్వాగతించాలన్నా టక్కున గుర్తొచ్చేది మార్ఫా బ్యాండ్‌. ఈ ఉల్లాసభరితమైన సంగీతం లేకపోతే హైదరాబాద్‌ సంప్రదాయం అసంపూర్ణమే. పాతబస్తీలో అందాల రాణులతో నృత్యం చేయించి, కొడుకు పెళ్లిలో నాగార్జునతో డ్యాన్స్‌ చేయించి.. తరాలకు, ప్రాంతాలకు అతీతంగా అలరించే శక్తి తనదని నిరూపించుకుంటోంది మార్ఫా సంగీత వాయిద్యం.. ఆఫ్రో, అరబ్‌ సంప్రదాయం నుంచి శతాబ్దాల క్రితం వలస వచ్చిన ఈ సంగీతం భాగ్యనగర సంస్కృతిలో భాగమైపోయింది. నగరంలో జరిగే ప్రతి వేడుకలోనూ తన ప్రశస్తిని చాటుకుంటోంది..  – సాక్షి, సిటీబ్యూరో

నగరంలో అబ్బురపరుస్తున్న రిథమిక్‌ ట్యూన్స్‌
సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా కుల, మత సంబంధం లేకుండా అభిమానులున్న నగరానికి చెందిన మార్ఫా సంగీతం ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది. మధ్యప్రాచ్యంలో మార్ఫా  ప్రదర్శనలు జరుగుతుంటే, మరోవైపు ఇటీవలే న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వంటి ప్రదేశాల్లో ఔత్సాహికుల నృత్యాలతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.   

ఆహార్యం నుంచి వైవిధ్యం..
తల చుట్టూ ఎర్రటి చెక్కిన స్కార్ఫ్‌లు చుట్టుకుని, తెల్లటి కుర్తాలు, లుంగీలను «మార్ఫా కళాకారులు దరిస్తారు. ఈ కళాకారులు రాత్రిపూట, నిర్విరామంగా మూడు నుంచి ఆరు గంటల పాటు నిలబడి ప్రదర్శనలు ఇస్తారు. మెడలో బరువైన ఢోలక్‌ మోస్తూనే లయకు అనుగుణంగా> నృత్యం చేయాలి. ఉత్సవాలు, ఊరేగింపుల్లో తీవ్ర అలసట కారణంగా మార్ఫా కళాకారుల నోటి నుంచి రక్తస్రావం, అనారోగ్యానికి గురికావడం జరుగుతుంటుంది. 

మార్ఫా బ్యాండ్‌లో సంప్రదాయంగా 8, 12, 16, 22 మంది సభ్యులు ఉంటారు. ప్రేక్షకుల ఆదరణ మేరకు, బృందంలోని కొంతమంది సభ్యులు నృత్యం చేయవచ్చు. వారి సహచరులు వాయిద్యాలను వాయించేటప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన డాగర్‌ డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఒక కళాకారుడు కత్తిని గాలిలోకి ఊపుతూ నర్తిస్తుంటే, ఇతర సంగీతకారులు క్రమంగా బీట్‌ టెంపోను పెంచుతారు.

వైవిధ్యభరిత వాయిద్యాల సమ్మేళనం..
మార్ఫా సంగీతంలో ‘మార్ఫా, సవారీ, నాగిన్, యాబు బక్కే రబు సాలా’ వంటి వివిధ శైలితో కూడిన రిథమ్స్‌ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ దానికంటూ సొంత విలక్షణమైన వైవిధ్యంతో అలరిస్తాయి. ఈ సంగీతం అనేక వాయిద్యాల సహాయంతో పలకిస్తారు. ప్రధానంగా మార్ఫాలు (ధోలక్, డాఫ్‌ అని పిలుస్తారు). వీటిని సంగీతకారులు ‘థాపి’ అని పిలిచే చెక్క స్ట్రిప్‌లతో కొడతారు. వీరి పూర్వీకులు మేక చర్మంతో తయారు చేసిన మార్ఫాలపై కొట్టేవారు. 

నేటి కళాకారులు  వాయించడం సులభం. ఖర్చు తక్కువ అవుతుందిని ఫైబర్‌ వాయిద్యాలు ఇష్టపడతున్నారు. కొన్ని విభిన్న వాయిద్యాలను కందూర, ముషాద్‌ జెట్టా, మార్ఫాలు, బిండియా పీటల్‌ అని పిలుస్తారు. వాటిలో ఎక్కువ భాగం ధోలక్‌ను పోలి ఉన్నప్పటికీ పరిమాణంలో తేడాలుంటాయి. ‘కళాకారులకు వారు వాయించడానికి ఎంచుకున్న వాయిద్యం ఆధారంగా వేతనం చెల్లిస్తారు’ అని కళాకారులు చెబుతున్నారు.

చరిత్రతో మమేకం.. 
ఈ మార్ఫా బ్యాండ్‌లు తరచూ జెండా మార్చ్‌ల వంటి  కార్యక్రమాలకు నియమించుకుంటారు. ఇటీవల మిస్‌ వరల్డ్‌ పోటీదారుల పాతబస్తీ సందర్శన సందర్భంగా వారికి మార్ఫా సంగీతం స్వాగతం పలికింది. నిజాం పాలనలో నగరానికి చేరుకుందీ యెమెన్‌ కళారూపం. ఈ కళారూపాన్ని నగరానికి ఎవరు పరిచయం చేశారు? అనే దానిపై కొంత వివాదం ఉంది. ఇది తీసుకొచ్చింది సిద్ధిలు (ఆఫ్రికన్‌ సంతతికి చెందిన వారు) అని కొందరు చెబుతుండగా, దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చింది యెమెన్‌ పూర్వీకులేనని కొందరు అంటున్నారు.

కళాకారులు ఏమంటున్నారు? 
‘నిజాం పాలనలో వేడుకల సందర్భాల్లో ఈ వాయిద్యాన్ని వినియోగించేవారు. నేటికీ గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మార్ఫా తప్పనిసరి’ అని మార్ఫా కళాకారుడు కయ్యూమ్‌ బిన్‌ ఒమర్‌ చెప్పాడు. గత 28 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్న ఓమర్‌ ప్రారంభంలో 70–80 మంది మార్ఫా బృందం ఉండేది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 15కి తగ్గింది. మొత్తంగా చూస్తే ఇప్పటికీ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నామనీ, తెలుగు రాష్ట్రాల వెలుపల కొన్ని ప్రదర్శనలు ఇస్తున్నామని ఒమర్‌ అంటున్నాడు. 

డాగర్‌ డ్యాన్స్‌ హైలెట్‌.. 
సాంప్రదాయ యెమెన్‌ నృత్యరూపం డాగర్‌ డ్యాన్స్‌కు అత్యంత డిమాండ్‌ ఉందని అరబి మార్ఫా బ్యాండ్‌ యజమాని మొహమ్మద్‌ యూసుఫ్‌ చెప్పారు. అయితే, నిజమైన కత్తులకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్‌ లేదా చెక్క కత్తులను వినియోగిస్తున్నారు. ‘గతంలో కొంతమంది ప్రేక్షకులు మద్యం మత్తులో కత్తులను లాక్కొని, ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కత్తుల వినియోగాన్ని నిషేధించింది, కానీ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి చెక్క లేదా ప్లాస్టిక్‌ కత్తులను ఉపయోగిస్తున్నాం’ అని మహమ్మద్‌ చెప్పారు. 

కళను సజీవంగా ఉంచేందుకు.. 
‘నా పేరు ఫిరోజ్‌. కానీ అందరూ నన్ను జాబ్రీ అని పిలుస్తారు. చిన్నతనం నుంచి అంటే 24 సంవత్సరాలుగా మార్ఫా ప్లే చేస్తున్నా. నగరంలో ముఖ్యంగా బార్కాస్‌ ఏసీ గార్డ్స్‌ వంటి ప్రదేశాల్లో మార్ఫా ప్రసిద్ధి చెందింది. నిజాంల కింద పనిచేసిన యెమెన్‌ సైనికుల ద్వారా 200 ఏళ్ల క్రితం మార్ఫా నగరానికి వచ్చిందంటారు. 

అదేమో గానీ మా పెద్దలు ఈ కళను నాకు అందించారు. దీనిని సజీవంగా ఉంచడానికి నా వంతు కృషి చేస్తున్నా. నా బృందంలో 20 మంది సభ్యులున్నారు. నగరం అంతటా వివాహాలు, వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తాం. మతాలకు అతీతంగా ఆహ్వానిస్తారు. ఇతర రాష్ట్రాలకూ వెళ్తుంటాం. కేవలం వారసత్వాన్ని సజీవంగా ఉంచాలన్నదే మా ఆలోచన.  – ఫిరోజ్‌ మార్ఫా ఆర్టిస్ట్‌ (సోషల్‌ మీడియా పోస్ట్‌ నుంచి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement