
వరుసగా లొంగిపోతున్న సీనియర్ మావోయిస్టులు
ఓ వైపు నిర్బంధం.. మరోవైపు ఎన్‌కౌంటర్లతో కుదుపు
శాంతి చర్చల ప్రతిపాదనను తెచ్చినా పట్టించుకోని కేంద్రప్రభుత్వం
తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సీనియర్ నేతలు
లొంగిపోతే అభ్యంతరం చెప్పొద్దని పార్టీ అభిప్రాయం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ముప్పై, నలభై ఏళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధ పోరాట బాట పట్టిన మావోయిస్టులు ప్రస్తుత సమాజ తీరు తెన్నులు తెలుసుకునేందుకు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారా? అన్న ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. ఓవైపు పెరిగిన నిర్బంధానికి తోడు మరో వైపు వరుస ఎన్‌కౌంటర్లతో వనాలను వీడి జనాల్లోకి వచ్చేందుకు మావోయిస్టులు మొగ్గు చూపుతున్నట్లు తాజా పరిణామాల ఆధారంగా తెలుస్తోంది.
తీవ్ర నిర్బంధం..
ఆపరేషన్ కగార్ మొదలయ్యాక సగటున పదిహేను రోజులకు ఒక ఎన్‌కౌంటర్ వంతున జరుగుతున్నాయి. ప్రతీ ఎన్‌కౌంటర్‌లో 10–15 మంది మావోయిస్టులు చనిపోతున్నారు. ఇలా పెరిగిన నిర్బంధం.. ఇంకో పక్క రిక్రూట్‌మెంట్లు తగ్గడమే కాక మావోయిస్టుల సప్‌లై చెయిన్ కూడా కుదుపులకు లోనైంది. దీంతో అడుగు వెనక్కి తగ్గిన మావోయిస్టులు మార్చి 28న శాంతి చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు మావోయిస్టుల కంచుకోటలుగా పేరున్న దండకారణ్యం, కర్రెగుట్టలు, ఏఓబీ, గడ్చిరోలి జిల్లాల్లో సాయుధ దళాల సంచారం కష్టంగా మారింది. ఇదే సమయంలో సరికొత్త సరెండర్ పాలసీని ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి దళ సభ్యులు, ఏరియా కమాండర్లు, జన మిలీíÙయా, పీఎల్‌జీఏ తదితర మావోయిస్టు పారీ్టకి చెందిన వారు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. ఈనెల 24న ఛత్తీస్‌గఢ్‌లో ఐదు జిల్లాల పరిధిలో ఏకంగా 64 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఈ కోవలోకి వస్తుంది.
నంబాల మృతి తర్వాత..
శాంతిచర్చల కోసం చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇవ్వకపోగా, మే 21న జరిగిన గుండెకోట్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు మరణం ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. పైగా నంబాల కేశవరావు టీమ్‌లో ఉన్న ఇద్దరు సభ్యులు ఎన్‌కౌంటర్‌కు రెండ్రోజుల ముందు అజ్ఞాత దళాలను విడిచి వెళ్లడం పారీ్టపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. తీవ్ర నిర్బంధం నేపథ్యంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి పార్టీలో సభ్యులకు ఎదురైనట్టు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ నాయకులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ తరఫున దిశానిర్దేశం చేయడం అగ్రనాయకత్వానికి కష్టంగా మారగా.. కిందిస్థాయి నేతలకు అగ్రనాయకులతో కాంటాక్ట్ దొరకడం దుర్లభమనే పరిస్థితులు నెలకొన్నాయి.
గెరిల్లాగా ఉండలేని పక్షంలో..
ఇటీవల జోరుగా కురుస్తున్న వానలతో అడవులు పచ్చబడ్డాయి. అయినా అడవులు మావోయిస్టులకు సేఫ్ జోన్‌గా ఉండలేకపోతున్నాయి. రోజురోజుకు పెరిగిన నిర్బంధం కారణంగా ఒకేచోట తలదాచుకోవడం, క్యాంప్‌లను మార్చడం క్లిష్టమైన వ్యవహారంగా మారింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరింత ఇక్కట్లు తప్పవనే భావనకు వచి్చనట్లు తెలిసింది. ఈ సమయంలో సాయుధ విప్లవ పోరాటమే మిన్న అనుకున్న వారు చావోరేవో అడవుల్లోనే అన్న నిర్ణయానికి రాగా.. అనారోగ్యం, ఇతర ఇబ్బందులు ఉన్నవారు లొంగిపోతే అభ్యంతరం చెప్పొద్దనే అభిప్రాయానికి పార్టీ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. దీంతో గడిచిన రెండు వారాలుగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు లీడర్ల లొంగుబాట్లు పెరిగాయనే వాదన వినిపిస్తోంది.
మార్పుల మదింపు
నంబాల కేశవరావు వంటి నాయకుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోతే, ఆయన మృతదేహానికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రభుత్వం చూపిన వైఖరిపై పౌరసమాజం నుంచి వచి్చన స్పందనను కూడా పార్టీ మదింపు చేసే ఆలోచనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ముప్‌పై నలభై ఏళ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఉన్న పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మధ్య వచి్చన మార్పును అంచనా వేయడం మంచిదనే అభిప్రాయానికి పార్టీ వచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే లొంగుబాట పట్టిన కేడర్‌ను వారించే ప్రయత్నం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.