ఇంట్రస్ట్‌.. ఇన్వెస్ట్‌ | Many companies are showing interest in investing in Telangana | Sakshi
Sakshi News home page

ఇంట్రస్ట్‌.. ఇన్వెస్ట్‌

Jan 22 2026 2:56 AM | Updated on Jan 22 2026 2:56 AM

Many companies are showing interest in investing in Telangana

దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి ఆసక్తి వ్యక్తీకరణ పత్రం అందజేస్తున్న ఎస్‌ఎంఆర్‌ ప్రతినిధులు. చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీల ఆసక్తి

దావోస్‌లో పలు సంస్థలతో సీఎం రేవంత్‌ బృందం భేటీలు 

రూ.12,500 కోట్ల పెట్టుబడికి రష్మి గ్రూప్‌ ఎంవోయూ

12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు 

క్లీన్‌ ఎనర్జీలో ‘న్యూక్లర్‌ ప్రొడక్ట్స్‌’ రూ.6 వేల కోట్ల పెట్టుబడులు 

ప్రపంచంలోనే తొలి ‘బ్యూటీ టెక్‌ జీసీసీ’ని ఏర్పాటు చేయనున్న లోరియల్‌

సాక్షి, హైదరాబాద్‌:  డక్టైల్‌ ఐరన్‌ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్, తెలంగాణలో స్టీల్‌ ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.12,500 కోట్ల పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 2026’సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్‌’ప్రతినిధి బృందం రష్మి గ్రూప్‌తో భేటీ అయ్యింది. తెలంగాణలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే అవసరమైన బొగ్గు సరఫరా లింకేజీ సహా ఇతర సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. చర్చల అనంతరం ఎంవోయూ కుదిరింది. గ్రీన్‌ మాన్యుఫాక్చరింగ్, సర్క్యులర్‌ ఎకానమీ వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా రష్మి గ్రూప్‌ చర్చించింది. ఈ భేటీలో సంస్థ ప్రమోటర్‌ సజ్జన్‌కుమార్‌ పటా్వరి, డైరెక్టర్‌ సంజీబ్‌కుమార్‌ పటా్వరి పాల్గొన్నారు. కాగా డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం బుధవారం మరికొన్ని కీలక భేటీలు జరిపింది. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. మరికొన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ కీలక ప్రకటనలు చేశాయి.  

రూ.6 వేల కోట్ల పెట్టుబడికి ఈఓఐ 
క్లీన్‌ ఎనర్జీ రంగంలో రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్‌ (ఎస్‌ఎంఆర్‌) ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈఓఐ) సమరి్పంచింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బృందంతో జరిగిన భేటీలో ఐక్యూ క్యాపిటల్‌ గ్రూప్‌ చైర్మన్‌ డా.న్‌ బాబిక్, సీఈఓ, డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌ బావిశెట్టి, గ్రీన్‌ హౌస్‌ ఎన్విరో సీఈఓ, డైరెక్టర్‌ మొలుగు శ్రీపాల్‌రెడ్డి, స్లోవాక్‌ రిపబ్లిక్‌ కాన్సుల్‌ మాటుస్‌ జెమెస్‌ పాల్గొన్నారు. 2047 నాటికి కాలుష్య రహిత తెలంగాణ సాధన లక్ష్యంతో తమ ప్రభుత్వం క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్‌ హౌస్‌ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ ఏర్పడింది. ఇది గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్‌ ప్రాజెక్టు స్థాపనకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. 

‘సర్గడ్‌’రూ.1,000 కోట్ల పెట్టుబడులు 
విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన ‘సర్గడ్‌’సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్‌ అండ్‌ రిపేర్‌ యూనిట్‌ నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌తో ‘సర్గడ్‌’సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్‌ తోట భేటీ సందర్భంగా జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ (ఎమ్మార్వో) కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్తగా ఏర్పాటయ్యే విమానాశ్రయాల్లో ఏదో ఒకచోట ఎమ్వార్వో కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. ‘సర్గడ్‌’పెట్టుబడితో రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. 

హైదరాబాద్‌లో లోరియల్‌ బ్యూటీ టెక్‌ జీసీసీ 
ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్‌ సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆవిష్కరణలు, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్‌ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా నిలిచే ఈ జీసీసీ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. దీని ద్వారా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్‌ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్‌ యూనిట్లకు అందుతాయి. మెడ్‌టెక్, హెల్త్‌టెక్‌తో పాటు ‘బ్యూటీ టెక్‌’వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని శ్రీధర్‌బాబు అన్నారు. తమ జీసీసీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా రేవంత్, శ్రీధర్‌బాబులను లోరియల్‌ ఆహ్వానించింది. కాగా రేవంత్‌రెడ్డి, లోరియల్‌ సీఈవో నికోలస్‌ హియోరోనిమస్‌ నడుమ జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ జీసీసీ ద్వారా 2030 నాటికి 2 వేల టెక్, ఏఐ, డేటా ఇంజనీరింగ్‌ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. 

‘బ్లైజ్‌’విస్తరణ 
హైదరాబాద్‌లోని తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించేందుకు కాలిఫోరి్నయాకు చెందిన ‘బ్లైజ్‌’సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. బ్లైజ్‌ కో ఫౌండర్, సీఈఓ దినకర్‌ మునగాల, ముఖ్యమంత్రి మధ్య జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్‌ కంప్యూటింగ్‌కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్‌వేర్, ఫుల్‌ స్టాక్‌ సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్థకు చెందిన డేటా సెంటర్‌ అభివృద్ధి చేస్తోంది.  

విస్తరణకు ‘ఏబీ ఇన్‌బెవ్‌’పెట్టుబడి 
ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతిపెద్ద బీరు తయారీ సంస్థ ‘ఏబీ ఇన్‌బెవ్‌ ’రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న తమ తయారీ యూనిట్‌ విస్తరణకు పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. సీఎం రేవంత్‌రెడ్డితో సంస్థ చీఫ్‌ లీగల్‌ అండ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ జాన్‌ బ్లడ్తో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్, సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. 

స్టేడియంల అభివృద్ధికి టాటా గ్రూప్‌ సంసిద్ధత 
– సంస్థ చైర్మన్‌తో సీఎం రేవంత్‌ భేటీ 
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం దవోస్‌లో టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసే ఆలోచన ఉందని చెప్పారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, 2036 ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాలు సాధించేలా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడంలో టాటా టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కాగా స్పోర్ట్స్‌ స్టేడియాల అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు చంద్రశేఖరన్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. 

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ఆయన ఆసక్తి చూపారు. రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుపై కూడా చర్చలు జరిగాయి. మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్‌ ఆసక్తి చూపింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్‌ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై కూడా చంద్రశేఖరన్‌ ఆసక్తి చూపారు.ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇలావుండగా..సీఎం నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్‌’బృందం సిస్కో సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement