షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు

బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు
సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో ఘటన
బయటకు తీసేందుకు శ్రమిస్తున్న పోలీసులు, అటవీ, ఫైర్ సిబ్బంది
రామారెడ్డి (ఎల్లారెడ్డి): అడవిలో షికారుకెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు గుట్టల మధ్య ఇరుక్కుపోయిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్‌లు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి షికారుకెళ్లారు. ఈ క్రమంలో గుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చాడు. కానీ చాడ రాజు అందులోనే చిక్కుకుపోవడంతో మహేశ్ కూడా రాత్రంతా అక్కడే ఉన్నాడు.
బుధవారం మధ్యాహ్నం వరకు రాజుకు మహేశ్ నీళ్లు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. అప్పటికీ అతను బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించగా వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు, రెడ్డిపేట, సింగరాయపల్లి గ్రామస్తులు చేరుకొని రాత్రి పొద్దు పోయే వరకు జేసీబీ సహాయంతో రాజును బయటకు తీసేందుకు శ్రమించారు. జేసీబీతో గుట్టలను పక్కకు తీసేందుకు వీలు కాకపోవడంతో లైటింగ్ ఏర్పాటు చేసి కామారెడ్డి నుంచి 210 ఈటాచీ తెప్పించారు.
రాజు ఉన్న చోట చార్జింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేయడంతో పాటు వైద్యుల సలహాల మేరకు పండ్ల రసాలను అందజేస్తున్నారు. ఈ గుట్టల మధ్య ఉడుములు, కుందేళ్లు ఉంటాయని వీటిని పట్టుకునే క్రమంలోనే గుట్టల మధ్య రాజు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. జంతువుల కోసం వచ్చినట్లు విచారణలో తేలితే కేసు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Hyderabad: బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్‌కు జరిమానా