స్మితా సబర్వాల్‌ ఇంట్లో చొరబడిన నిందితుడిపై అనుమానాలు

Man Entered IAS Smita Sabharwal House Suspicious - Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవిలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి గురు వారం రాత్రి అనుమానాస్పదంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్‌ చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితుడు బాబుతో కలిసి రాత్రి 11.34 గంటలకు ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆనంద్‌ అక్కడినుంచి ‘ఎట్‌ యువర్‌ డోర్‌ స్టెప్‌’అంటూ ట్వీట్‌ చేశాడు. ఆమె నివాసముంటున్న ప్లాట్‌ యూసుఫ్‌గూడ పోలీసు లైన్స్‌లోని ప్లెజెంట్‌ వాలీ గేటెడ్‌ కమ్యూనిటీలో. అంతేకాకుండా 24 గంటలు పోలీసు సెక్యూరిటీ ఉంటుంది.

ఇంత బందోబస్తు ఉన్న ప్లాట్‌లోకి అంత ధీమాతో ఎలా వెళ్లాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడా లేక మానసిక స్థితి కోల్పోయాడా అన్నది తేలాల్సి ఉంది. నిందితుడు పక్కాప్లాన్‌తోనే వచ్చినట్లుగా తెలుస్తోంది. స్నేహితుడిని బయట కారులో ఉంచి ఆనంద్‌ మాత్రమే లోనికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగం విషయం మాట్లాడాలంటే పగలు రావాలిగానీ రాత్రి ఎందుకు వచ్చారు అన్నది అర్థం కావడం లేదు.

మరోవైపు నిందితుడు విద్యావంతుడు. ఎమ్మెస్సీ మ్యాథ్స్, లా, జర్నలిజం చదివి న్యూఢిల్లీలో వార్త పత్రిక కరస్పాండెంట్‌గా, దక్కన్‌ క్రానికల్‌ ఆసియా ఏజ్‌ పత్రిక జర్నలిస్ట్‌గా, సూర్య పత్రిక న్యూఢిల్లీ జర్నలిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇంత కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఈయన ఐఏఎస్‌ అధికారిణి ఇంట్లోకి ఆ విధంగా వెళ్లడం విడ్డూరంగా ఉంది. ఏదేమైనా నిందితులను కస్టడీలోకి తీసుకుంటేనే పూర్తి వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా స్మితా సబర్వాల్‌ ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
చదవండి: తొలుత ఎస్‌ఏలు.. తర్వాత ఎస్జీటీలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top