- ప్రమాదంలో ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
- పేలిన రిఫ్రిజిరేటర్లలోని సిలిండర్లు
- ఎగసి పడిన మంటలు.. పక్క దుకాణాలకు వ్యాప్తి
- ఐదు ఫైరింజన్లతో మంటలార్పిన ఫైర్ సిబ్బంది
- ఐదుగురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ శాలిబండ క్లాక్ టవర్ పక్కనున్న గోమతి ఎల్రక్టానిక్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాద సంఘటనలో ఒకరు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం మంటలకు పూర్తిగా తగలబడిపోయాయి. మంటలకు తగలబడిన కారు సీఎన్జీ వాహనం కావడంతో అందులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. గాయపడ్డ వారందరినీ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
బాంబు పేలుడు మాదిరిగా...
బాంబులు పేలిన శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అటువైపు నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు, పాదచారులు బెంబేలెత్తారు. మంటల ధాటికి దుకాణం షట్టర్ ఎగిరి 100 మీటర్ల దూరంలో పడిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎల్రక్టానిక్ షోరూమ్ కావడంతో అందులోని ఏసీలు రిఫ్రిజిరేటర్లు వరుసగా పెద్ద పెట్టున శబ్దాలు చేసి పేలిపోయాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
మొగల్ పురా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అటువైపు నుంచి రాకపోకలను నిలిపివేసి అగ్ని మాపక సిబ్బందికి సహకరించారు. భారీ అగ్ని ప్రమాదం కావడంతో గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూం అనుకొని ఉన్న దుకాణాల సిబ్బందితోపాటు నివాస ప్రాంతాల్లోని ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు ఎంత నష్టం జరిగిందనే విషయం కూడా తెలియదని సంబంధిత దుకాణాల యజమానులు చెబుతున్నారు.
షోరూం బంద్‌జేస్తున్న సమయంలో సరిగ్గా 10.28 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు పక్కనే ఉన్న శాలిబండ క్లాక్ టవర్ లోని సమయం తెలియజేస్తోంది. ప్రమాదం ధాటికి క్లాక్ టవర్‌లోని వాచీ ఆగిపోయింది. విషయం తెలిసిన వెంటనే దక్షిణ మండలం డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రెండు గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. మొగల్ పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


