సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు, వాటి నిర్వాహకుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు జరిగాయి. జనప్రియ, రాజా డెవలపర్స్, సత్యసాయి, గాయత్రి హోమ్స్, శివసాయి కన్‌స్ట్రక్షన్స్‌తో సహా మొత్తం ఎనిమిది సంస్థల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్, అనుబంధ సంస్థలపై PMLA, 2002 కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రీలాంచ్ స్కీమ్ పేరిట గృహ కొనుగోలుదారులను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టై.. బెయిల్ మీద బయటకు వచ్చిన శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే..
ఈ స్కాంతో లింకుల నేపథ్యంలో ఎనిమిది రియల్ ఎస్టేట్ సంస్థల్లో తాజాగా తనిఖీలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమ నగదు చలామణి.. మనీలాండరింగ్ అనుమానాల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సోదాల సమయంలో అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.


