ఈఎస్‌ఐసీ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిలో ఘటన
ఐదుగురికి తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిలో ప్రమాదవశాత్తు సెంట్రింగ్ లిఫ్ట్ వైరు తెగి కిందపడిపోవడంతో ఓ కార్మికుడు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఆసుపత్రి భవనానికి ఉన్న గ్రానైట్స్‌ను తొలగించి కిందకు తీసుకువచ్చే క్రమంలో సస్పెండెడ్ ప్లాట్‌ఫాం (సెంట్రింగ్ లిఫ్ట్) వైరు తెగిపోయింది.
సోమవారం సాయంత్రం జరిగిన సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం..ఆసుపత్రి నిర్మాణ సమయంలో భవనం చుట్టు గ్రానైట్ రాళ్లు అమర్చారు. నాణ్యత లోపించిన కారణంగా ఇటీవల ఆ రాళ్లు ఒక్కొక్కటిగా ఊడి కింద పడుతున్నాయి. దీంతో పాత గ్రానైట్‌ను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ దాదాపు 20 రోజుల నుండి కార్మికుల చేత పనులు చేయిస్తున్నాడు.
ఇందులో భాగంగా తొలగించిన గ్రానైట్‌ను సస్పెండెడ్ ప్లాట్ ఫాంపై పెట్టి కిందకు దింపుతున్న సమయంలో వైరు తెగి ఆరవ అంతస్తు నుంచి ప్లాట్ ఫాం ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో అందులో పనిచేస్తున్న భానుచందర్ (24) మృతి చెందాడు. మరో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రఘుపతి, మోహన్ పరిస్థితి విషమంగా ఉండగా మల్లేశ్, మైసయ్య గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుడు భానుచందర్ ఒంగోలుకు చెందిన వాడు కాగా అతడి బావ, విజయవాడకు చెందిన నాగరాజు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. ప్లాట్ ఫాంపై ఎక్కువ మోతాదులో గ్రానైట్స్ పెట్టిన కారణంగా వైరు తెగిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. వివిధ కోణాలలో కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా తీవ్ర గాయాలపాలైన భానుచందర్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేశామని డీన్ శిరీష్ కుమార్ తెలిపారు.


