సాక్షి హైదరాబాద్: సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. దీంతో సాయంత్రం నాంపల్లి కోర్టులో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకు తరలించారు. అయితే కస్టడీలో అతని నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
ఐబొమ్మ రవి ఒక్కడే పైరసీ చేశాడని.. అలా రూ. 100 కోట్లకు పైగా సంపాదించాడని నిర్ధారించుకున్నారు. ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి మరీ సినిమాలు కొనుగోలు చేశాడు. మూవీపై క్లిక్ చేయగానే.. 15 యాడ్స్‌కు డైరెక్ట్ లింక్ అయ్యేలా ఏర్పాటు చేశాడని గుర్తించారు.
రవికి బెయిల్ రావొచ్చు..
రవిపై చాలా సెక్షన్లతో కేసులు పెట్టారని.. అందులో రెండు మాత్రమే వర్తిస్తాయని అంటున్నారు అడ్వొకేట్ సీవీ శ్రీనాథ్. రవి బెయిల్ వ్యవహారంపై ఆయన సాక్షితో మాట్లాడారు. ‘‘మా క్లయింట్ రవి ఐదు రోజుల కస్టడీ ముగిసింది. కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడా జైలుకు తరలించారు. 27వ తేదీన తిరిగి తమ ఎదుట హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
బెయిల్ పిటిషన్ రిమాండ్ అయిన రెండో రోజే వేశాం. కస్టడీ విధించాక వేశాం కాబట్టే ఆలస్యమైంది. రేపు పీపీ కౌంటర్ వేశాక బెయిల్ మూమెంట్ ఉంటుంది. అతనిపై రెండు సెక్షన్ లు మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. మిగతా కేసులపై కోర్టులో కొట్లాడుతాం. బెయిల్ వస్తుందని భావిస్తున్నాం. అన్నీ ట్రయల్స్‌లో చూసుకుంటాం అని రవి లాయర్ శ్రీనాథ్ తెలిపారు.
రవి ఐదు రోజుల కస్టడీలో వెబ్ సైట్, డొమైన్ నెట్వర్స్, ఐపీమాస్క్ తదితర అంశాలపై ఆరాతీసినట్లు సమాచారం. రవితో కలిసి అతని స్నేహితుడు ఇద్దరు కలిసి టైక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్ తదితర అంశాల్లో పాల్గొన్నట్లు తేల్చుకున్నారు. రూ.20 కోట్ల బదిలీ వివరాలను బ్యాంకు అధికారుల ద్వారా తెప్పించుకున్న పోలీసులు ఆ నగదు విషయంపై ఆరా తీశారు.
1xbet అనే బెట్టింగ్ యాప్‌తో పాటు ఇతర యాప్‌ల ద్వారా రవి భారీగా డబ్బులు సంపాదించినట్లు ఇప్పటికే పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ డబ్బులను క్రిఫ్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే తన స్నేహితుడికి పంపినట్లు గుర్తించారు. కాగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు అన్ని తానొక్కడినే చేశాను తన వెనుక ఎవరూ లేరు అని రవి సమాధానం చెప్పినట్లు సమాచారం.
రవిపై ఇతర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలోనూ ఐదు కేసులు నమోదయ్యాయి మిగతా కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఐబొమ్మ రవిని సైబర్ పోలీసులు మరోసారి విచారించే అవకాశమూ లేకపోలేదు. కాగా రేపు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఐబొమ్మ రవి కేసులో ప్రెస్‌మీట్ ద్వారా మిగతా వివరాలను వివరించే అవకాశం ఉంది.


