సాక్షి, జనగాం: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంతో తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయబోనని సోమవారం అన్నారాయన.
‘‘నేను రాజీనామా చేయడం లేదు. నా రాజీనామా, ఉప ఎన్నిక గురించి ఆలోచించొద్దు. స్పీకర్ నిర్ణయం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్. దేశవ్యాప్తంగా నాకు గుర్తింపు ఉంది. నేను ఫ్లైట్ దిగితే అభిమానులు ఎదురొస్తారు’’ అని అన్నారాయన.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇచ్చిన నోటీసుల గడువు ఆదివారం ముగిసింది. అయితే స్పీకర్ విధించిన గడువులోగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ సమాధానం ఇవ్వలేదు. అయితే నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు తనకు కొంత వ్యవధి కావాలని ఈ నెల 21న స్పీకర్‌ను కడియం శ్రీహరి వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
అయితే ఆయన చేసిన విజ్ఞప్తిపై స్పీకర్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పీకర్‌ను ఫోన్ ద్వారా గడువు కోరినట్టు ప్రచారం జరుగుతోంది.


