
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో దొంగతనం కేసులో నిందితులను పట్టుకుని, వారు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
మాదాపూర్ డీసీపీ వినిత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో డీసీపీ వినిత్ మాట్లాడుతూ.. ఆగస్టు 12వ తేదీన చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులోకి నిందితులు వచ్చారు. మేనేజర్‌పై ఫైరింగ్ చేశారు.. ఆభరణాలు దోచుకున్నారు. ఖజానా జ్యువెలరీ దొంగతనంలో ఇద్దరిని అరెస్టు చేశాం. మరో ఐదుగురు దొంగలు పరారీలో ఉన్నారు. 900 గ్రాముల వెండి, గోల్డ్ కోటెడ్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. మొత్తం ఏడుగురు కలిసి ఖజానా జ్యువెలరీలో దొంగతనానికి పాల్పడ్డారు. వాళ్ళ మీద గతంలో మర్డర్ కేసులు, దొంగతనం కేసులున్నాయి. ఆశిష్ అనే దొంగ ఇంట్లో ఉంటూ 20 రోజులపాటు రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగలు వెళ్లిన దారి, లోకేషన్ ట్రేస్ చేసి పసిగట్టి పూణే దగ్గర అరెస్టు చేశాం. 24 గంటల్లో కేసు ఛేదించాం. అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించాం.
ప్రతీ జ్యువెలరీ షాప్ సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకొని షాప్ నిర్మాణాలు చేసుకోవాలి. రెండు బైకులలో ఆరుగురు వచ్చారు దొంగతనంలో పాల్పడ్డారు ఒకతను వీళ్లకు సహకరించాడు మొత్తం ఏడుగురు. మొత్తం నాలుగు వెపన్స్ తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. A1 మోటార్స్ అనే బైక్ మెకానిక్ షాప్ లో రెండు సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ లను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి పారిపోయే ప్రయత్నం చేశారు. బైకులకు నెంబర్ ప్లేట్లు తీసేసి దొంగతనానికి పాల్పడ్డారు. కొంత దూరం వరకు బైకులపై వెళ్లి తర్వాత వివిధ మార్గాలలో పూణే వరకు చేరుకున్నారు. ఇంకా ఐదుగురు పరారీలో ఉన్నారు వాళ్లలో మోస్ట్ క్రిమినల్ ఒకతను ఉన్నాడు. ఫైరింగ్ చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.
ఒకే దగ్గర ఎక్కువ బంగారం దొరుకుతుందనే ఆలోచనతో ఖజానా జ్యువెలరీపై పడ్డారు. 10 కేజీల వరకు వెండి ఆభరణాలు పోయాయి. ఇలాంటి దొంగతనాలు బీహార్లో, రాజస్థాన్, మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కూడా జరిగాయి. ఇంకా పూర్తి విచారణ చేస్తున్నాం. ఈ గ్యాంగు బంగారం షాపులపైనే షాపులలో ఎక్కువ దొంగతనాలకు పాల్పడుతుంటారు. బీహార్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి ఈ దొంగల ముఠాకు అన్ని రకాలుగా సహకరించాడు. వీరి మీద అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నాయి అని తెలిపారు.
కాగా, ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా జ్యవెలర్స్‌లో పట్టపగలే దుండగులు డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. అనంతరం షాపులోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగులగొట్టారు. అవన్నీ మూడు బ్యాగుల్లో నింపుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి బైకులపై పరారయ్యారు. పోలీసులు వచ్చే సమయానికే పారిపోయిన దొంగల ముఠా సీసీ కెమెరాలపై కాల్పులు జరిపి వాటిని కూడా ధ్వంసం చేశారు. అయితే, పోలీసులు విచారణలో భాగంగా దోపిడీ గ్యాంగ్ నెల రోజుల క్రితమే బీహార్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాసు పరిశ్రమలో పనిలో చేశారు. బీహార్ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకుని.. దాదాపు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి దోపిడీ చేసి ఉడాయించారు.