నోట్ తయారు చేయాల్సిందిగా పీఆర్ శాఖకు సర్కార్ ఆదేశాలు
సంబంధిత అంశాలపై సీఎస్ సమీక్ష!
17న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు మళ్లీ ఊపందుకుంటోంది. ఈ నెల 24న హైకోర్టులో ఈ అంశంపై కేసు విచారణకు రానుండడంతో..వీటి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 24వ తేదీలోగా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలన్న కోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. ఈ నెల 17న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వవర్గాలు చెబుతుండగా..ఈ భేటీలో ఎన్నికలపై చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నోట్ తయారు చేయాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మరోవైపు బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్, పీఆర్‌ఆర్డీ డైరెక్టర్‌డాక్టర్ జి.సృజనతో సీఎస్ కె.రామకృష్ణారావు సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, శాఖాపరంగా తయారీ అంశాలను ఆరా తీసినట్టు తెలుస్తోంది.
నిధులు నిలిచిపోవడంతో పెరుగుతున్న ఒత్తిడి
దాదాపు 20 నెలలుగా కేంద్ర ఆర్థిక సంఘం, ఇతర కేంద్ర గ్రాంట్లు నిలిచిపోవడం, రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ)పరంగానూ నిధుల విడుదల చేయలేకపోవడంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో నిధుల లేమి సమస్య చాలా తీవ్రంగా మారింది. సకాలంలో స్థానిక ఎన్నికలు జరగక పోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.3 వేల కోట్లు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలోనే కేంద్ర నిధుల సాధన కోసం ఎన్నికలు జరపాలనే ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వంపై పెరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వ పరంగా చేయాల్సినంత చేసినందున, రిజర్వేషన్ల పెంపుదల అంశం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం అనేది రాష్ట్ర పరిధిలో లేనందున ఎన్నికలకు వెళితేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది.
17న ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ!
ఈ నెల 14న బిహార్ అసెంబ్లీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నందున, 17న నిర్వహించే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం. కాగా ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయిలో నోట్‌ఫైల్‌తయారు చేయాలని పీఆర్ ఉన్నతాధికారులను సీఎస్‌ఆదేశించినట్టు తెలిసింది. ఇలావుండగా.. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే హైకోర్టుకు తెలియజేసింది.
స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్ల శాతం ఖరారుతో పాటు, ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన వెంటనే తాము కార్యరంగంలో దిగుతామని స్పష్టం చేసింది. శాంతిభద్రతల పరిస్థితిపై.. సీఎస్, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఎస్‌ఈసీ సమావేశాలు నిర్వహించి అంతా సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
మొత్తం అయిదు విడతల్లో జిల్లా, మండల పరిషత్ (రెండు విడతల్లో), గ్రామపంచాయతీ (మూడు విడతల్లో) ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలతో పాటు, మొదటిదశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ కూడా జారీ చేసిన సంగతి విదితమే. అయితే రిజర్వేషన్ల జీవో, ఎస్‌ఈసీ షెడ్యూల్, నోటిఫికేషన్‌లను హైకోర్టు నిలుపుదల చేయడంతో ఈ ఎన్నికలు ఆగిన సంగతి తెలిసిందే.


