17న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొనే అవకాశం
పార్టీ తరఫున 42% సీట్లు కేటాయించాలన్న యోచనలో ప్రభుత్వం
గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం పాలసీని ఆమోదించనున్న మంత్రివర్గం
తెలంగాణ రైజింగ్ నిర్వహణ తీరుతెన్నులపైనా జరగనున్న చర్చ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణతోపాటు ఇతర కీలకాంశాలపై చర్చించి ఈ భేటీలో నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై అమలును నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వగా దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా చుక్కెదురవడం తెలిసిందే.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యంపై పలువురు వ్యక్తులు వేసిన మరో కేసును ఇటీవల విచారించిన హైకోర్టు.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో దీనిపై కేబినెట్ విస్తృతంగా చర్చించి ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలని.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు కనీసం 42 శాతం సీట్లను కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ విజయంపై..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సాధించిన ఘన విజయంపైనా కేబినెట్ భేటీలో ప్రభుత్వం విస్తృతంగా చర్చించనుంది. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన మద్దతు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తులో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయం తీసుకోనుంది. అలాగే గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన పాలసీని మంత్రివర్గం ఆమోదించనుంది. మరోవైపు తెలంగాణ రైజింగ్ సమ్మిట్–2025, డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వం రెండో వార్షికోత్సవం, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో వాటి నిర్వహణ తీరుతెన్నులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇప్పటికే పీఆర్ శాఖకు సీఎస్ ఆదేశాలు
ఈ నెల 17న కేబినెట్ భేటీ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలు, కోర్టు కేసు పూర్వాపరాలు–ప్రస్తుత స్థితిని వివరిస్తూ సవివరమైన నోట్ రూపొందించాల్సిందిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖను సీఎస్ కె.రామకృష్ణారావు ఇప్పటికే ఆదేశించారు. ఈ నెల 12న పీఆర్‌ఆర్‌డీ శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ఈ ఎన్నికల ప్రస్తుత పరిస్థితి, పీఆర్ శాఖాపరంగా సంసిద్ధత తదితర అంశాలపై సీఎస్ ఆరా తీశారు.


