
వాణిజ్య క్రయ విక్రయాలకు అనుమతులు మంజూరు
పరిశ్రమలకు భూ కేటాయింపుల బాధ్యత ఎఫ్‌సీడీఏదే
జూన్ నుంచి ఎఫ్‌సీడీఏ కార్యకలాపాలు ప్రారంభం
హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌సీడీఏ కమిషనర్‌కు అధికారాల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) శరవేగంగా అడుగులు వేస్తోంది. జూన్ నుంచి ఎఫ్‌సీడీఏ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఫ్యూచర్ సిటీలో ఓపెన్ ప్లాట్ లేఔట్లు, నివాస, వాణిజ్య భవన నిర్మాణాల అనుమతులతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎఫ్‌సీడీఏ (FCDA) అనుమతులు మంజూరు చేయనుంది. వీటితో పాటు పరిశ్రమలు, ఐటీ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్ట్‌లకు భూ కేటాయింపుల బాధ్యత కూడా ఎఫ్‌సీడీఏనే నిర్వహించనుంది.
హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌సీడీఏకు..
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో తెలంగాణలో ఫోర్త్ సిటీ (fourth city) అభివృద్ధి అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివార్లలోని ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ 7 మండలాలోని 56 రెవెన్యూ గ్రామాలు ఎఫ్‌సీడీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త అనుమతులు, ఆమోదాలను నిలిపివేయడం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, భూ యజమానులలో అనిశ్చితి ఏర్పడింది. దీంతో అథారిటీ ఏర్పాటు వేగంగా జరిగినా.. రెండు నెలల పాటు కార్యకలాపాల నిర్వహణ జరగలేదు. దీంతో ఆయా ప్రాంతాలలో స్థిరాస్తి ప్రాజెక్ట్‌లు, అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడింది.
మార్చి వరకూ ఫ్యూచర్ సిటీ ప్రాంతాలలో భవనాలు, లేఔట్ల అనుమతులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి అథారిటీ (హెచ్‌ఎండీఏ), స్థానిక సంస్థలు మంజూరు చేశాయి. తాజాగా ప్రభుత్వం అధికారాన్ని కార్యాచరణలోకి తీసుకురావడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఎఫ్‌సీడీఏ పరిధిలో లేఔట్లు, నిర్మాణ అనుమతుల అధికారాలను హెచ్‌ఎండీఏ (HDMA) నుంచి ఎఫ్‌సీడీఏ కమిషనర్‌కు బదిలీ చేశారు. దీంతో శ్రీశైలం హైవే వెంబడి ఉన్న ఈ ఫ్యూచర్ సిటీలో పట్టణ మరియు పారిశ్రామిక విస్తరణతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి వీలు కలగనుంది.
ఫ్యూచర్ సిటీ పేరు మార్పు?
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీసు స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీల పేర్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీకి కూడా జాతీయ స్థాయిలో గౌరవం పొందేలా ఫ్యూచర్ సిటీని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’గా పేరు మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పలు కార్యక్రమాలలో సీఎం తన ప్రసంగాలలో దీన్ని భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City)గా ప్రకటించారు. దీంతో జాతీయ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీ
విస్తీర్ణం: 765.28 చ.మీ
ఎకరాలు: 2,01,318
జనాభా: 1,31,733