
మేడ్చల్ కారిడార్‌లో 18, శామీర్‌పేట్‌లో 14 స్టేషన్లు
నార్త్, ఫ్యూచర్ సిటీ మార్గంలో రోజుకు 3 లక్షల మంది ప్రయాణించేలా..
రూ.19,579 కోట్లతో హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ప్రణాళికలు
త్వరలో కేంద్రానికి నివేదన: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశలో భాగంగా ‘బి’ విభాగం కింద ప్రతిపాదించిన మూడు కారిడార్‌లకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధమయ్యాయి. నార్త్‌సిటీలో ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్, శామీర్‌పేట్ రూట్‌లలో, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ (Skill University) వరకు మూడు కారిడార్‌లలో మెట్రో నిర్మాణానికి రెండో దశలోనే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మొదటి ఐదు కారిడార్‌లతో పాటు ఈ మూడు కారిడార్‌లను సైతం రెండో దశలో భాగంగా చేపట్టనున్నారు. మొదటి ఐదు కారిడార్‌ల డీపీఆర్‌లు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో నాలుగు నెలల క్రితమే కేంద్రానికి అందజేశారు.
‘బి’ విభాగం కింద ప్రతిపాదించిన ఈ మూడు కారిడార్‌ల డీపీఆర్‌లను సైతం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో త్వరలో కేంద్రానికి పంపించనున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy) తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన డీపీఆర్‌ల వివరాలను వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. డీపీఆర్‌లను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌మెట్రో రైల్ బోర్డు ఈ నెల 8న ఆమోదించినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ మూడు కారిడార్‌ల నిర్మాణం పూర్తయ్యే నాటికి ప్రతిరోజూ సుమారు 3 లక్షల మందికి పైగా రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2028 నాటికి రెండో దశలోని అన్ని రూట్లలో 10 లక్షల మందికి పైగా ప్రయాణించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
జేబీఎస్.. మెట్రో హబ్..
జేబీఎస్ ప్యారడైజ్ స్టేషన్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో అతిపెద్ద మెట్రో హబ్‌ను నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి శామీర్‌పేట్, మేడ్చల్ మార్గాల్లో మెట్రో విస్తరణ చేపట్టనున్నారు. ప్రయాణికులు ఒక కారిడార్ నుంచి మరో కారిడార్‌కు మారేందుకు స్కైవాక్ ఏర్పాటు చేస్తారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు మొత్తం 24.5 కిలోమీటర్ల మార్గంలో 18 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కి.మీల కారిడార్‌లో 14 మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. మెట్రో రెండో దశలో ‘బి’ విభాగం కింద రు.19,579 కోట్ల అంచనా వ్యయంతో 86.1 కి.మీ. పొడవు గల జేబీఎస్– మేడ్చల్, జేబీఎస్– శామీర్‌పేట్, ఎయిర్ పోర్ట్– ఫ్యూచర్ సిటీ మెట్రో రెండో దశ (బి) కారిడార్లకు డీపీఆర్‌లను రూపొందించినట్లు ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
రూ.43,579 కోట్ల వ్యయంతో 8 కారిడార్‌లు
మెట్రో రెండో దశలో ప్రభుత్వం మొదట 76.4 కిలోమీటర్లతో 5 కారిడార్‌ల నిర్మాణానికి సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి అందజేశారు. కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సుమారు రూ.24 వేల కోట్ల అంచనాలతో రెండో దశలో మొదటి 5 కారిడార్‌లను ప్రతిపాదించారు. ప్రస్తుతం మరో 3 కారిడార్‌లకు డీపీఆర్‌లు పూర్తయ్యాయి. రెండోదశ కింద ప్రతిపాదించిన మొత్తం 8 కారిడార్‌లలో సుమారు 162 కి.మీల నిర్మాణానికి రూ.43,579 కోట్ల వ్యయం కానుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు. కానీ.. కేంద్ర కేబినెట్ దీనిపై దృష్టి సారించినప్పుడే కీలకమైన ముందడుగు పడ్డట్లుగా భావించాలి.
చదవండి: యాదగిరిగుట్టకు ఎంఎంటీస్