సాక్షి, హైదరాబాద్: సిబిల్ స్కోర్ నివేదికలో ప్రజల వ్యక్తిగత డేటా పరిరక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఇదే చివరి అవకాశమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించాల్సి వస్తుందని తేల్చిచెప్పింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలై ఐదేళ్లు కావొస్తున్నా కౌంటర్ వేయకపోవడంక్షంతవ్యం కాదంటూ తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా వేసింది.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల సవరణ నిబంధనలకు సంబంధించి 2021, నవంబర్ 29న ఆర్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే విధించాలని కోరు తూ హైదరాబాద్‌కు చెందిన కృపాసోని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధ వారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘సిబిల్’పై పారదర్శక, స్వతంత్ర యంత్రాంగం రూపొందించే వరకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సేవా కంపెనీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, సిబిల్ రూపంలో ప్రచురించి, వ్యాప్తి చేయకుండా నిరోధించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ప్రతివాదుల తీరును తప్పుబట్టింది.


