
సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతులు
పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని రైతులు యూరియా కోసం మంగళవారం ఉదయం పీఏసీఎస్ వద్దకు అధిక సంఖ్యలో వచ్చి క్యూలో నిల్చున్నారు. ఒకే కౌంటర్ ఉండడంతో ఒకవైపు మహిళలు, మరోవైపు పురుషులు క్యూ కట్టారు. రెండువైపుల నుంచి రైతులు కౌంటర్ వద్దకు ఒకేసారి తోసుకోవడంతో శ్వాస ఆడక ముగ్గురు మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోయారు.
పోలీసులు, వ్యవసాయ సిబ్బంది వారిని పక్కకు తీసుకొచ్చి ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేయడంతో ఇద్దరు మహిళలు స్పృహలోకి వచ్చి మరలా క్యూలైన్‌లోకి వెళ్లారు. గేమ్యానాయక్‌తండాకు చెందిన లక్ష్మి కొంత ఇబ్బంది పడటంతో 108లో పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ చొరవ తీసుకుని పీఏసీఎస్‌కు పక్కనే ఉన్న పాత సీడీపీఓ కార్యాలయం వద్ద మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయించారు.
రైతుపై చేయిచేసుకున్న హోంగార్డు!
యూరియా కోసం క్యూలో నిల్చున్న ఓ రైతుపై హోంగార్డు చేయిచేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్ పెద్దవూరకు వచ్చి బాధిత రైతుతో మాట్లాడారు. తనను హోంగార్డు ఏమీ కొట్టలేదని, తాను వేకువజామునే వచ్చి క్యూలో నిల్చున్నట్లు మూత్రం రావడంతో బయటకు వెళ్లి వచ్చానని, తిరిగి క్యూలో నిల్చుండగా ఈ క్రమంలో తన వెనకాల ఉన్న రైతులు గొడవ చేశారని, దీంతో హోంగార్డు వచ్చి తనను బయటకు లాగే ప్రయత్నం చేశాడని, తాను ఉన్న విషయాన్ని చెప్పడంతో వెళ్లిపోయాడని చెప్పాడు.
» సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్‌లోని మనగ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం పెద్ద సంఖ్యలో బారులు దీరారు.