గ్రామీణ ప్రాంతాల్లో భూములన్నింటినీ సర్వే చేయాలని ప్రభుత్వ నిర్ణయం
ప్రతి జిల్లాలో 70 గ్రామాలు ఎంపిక చేయాలని ఉత్తర్వులు
లైసెన్స్‌డ్ సర్వేయర్లతో సర్వే చేసేందుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూముల సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సర్వే శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నియమించిన 3,500 మందికిపైగా లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ఇప్పటికే ఆ శాఖలో పనిచేస్తున్న సర్వేయర్లతో ఈ సర్వేను చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకుగాను రాష్ట్రంలోని అన్ని గ్రామీణ జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయాలని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం నుంచి అక్టోబర్ మూడో వారంలోనే ఉత్తర్వులు వెళ్లాయి.
ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే గ్రామాలను ఎంపిక చేసే కసరత్తు ప్రారంభించారు. అయితే, కలెక్టర్లు తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల జాబితాలో మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సీసీఎల్‌ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించిన మేరకు 200లోపు ఎకరాలున్న గ్రామాలు, సర్వే సమస్యలు తక్కువగా ఉండే గ్రామాలను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామాల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలలోనే సర్వేను పైలట్ పద్ధతిలో ప్రారంభిస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
హద్దుల నిర్ధారణ... భూదార్ జారీ
భూముల సర్వేలో భాగంగా ప్రతి భూకమతానికి హద్దులు నిర్ణయించనున్నారు. డీజీపీఎస్ ద్వారా సేకరిచిన డాటాను క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, ఇందుకోసం సర్వే సిబ్బందిని వినియోగించుకోవాలని రెవెన్యూ శాఖ చెప్పింది.
సర్వే అనంతరం ప్రతి భూకమతం హద్దులు నిర్ణయించడంతోపాటు ఆ కమతాలకు ఆధార్ తరహాలో భూదార్ కార్డులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న సర్వే అనంతర ఫలితాలను బట్టి రాష్ట్రమంతటా సర్వే నిర్వహిస్తామని అంటున్నారు.


