
కేంద్రం కేటాయించిన ఎరువులు కూడా రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేయలేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇది రైతు ప్రభుత్వం కాదని..రాక్షస ప్రభుత్వమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సకాలంలో పంటలకు యూరియా అందించకపోవడంతో 70 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారని సోమవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా పొలంలో ఉండాల్సిన రైతులు ఎరువుల దుకాణాల ముందు ఎదురుచూపులు చూస్తున్నారన్నారు. గత పదేళ్లలో ఎన్నడూ రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లు కట్టిన దాఖలాలు లేవని చెప్పారు.
యూరియాపై ప్రభుత్వ సమీక్షలు లేకపోవడం, కేంద్రం, రాష్ట్రం మధ్య కొరవడిన సమన్వయం మూలంగా రాష్ట్రంలో ఇప్పుడు యూరియా, డీఏపీ కొరత ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం ఎరువుల కొరత రాకుండా ఏప్రిల్, మే నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ లేని సమయంలోనే నోడల్ ఏజెన్సీ మార్క్‌ఫెడ్‌కు ఆర్థిక సహాయం అందించి జూన్ నెల నాటికి 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు, డీలర్ల వద్ద మరో 3 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉండేలా చూసుకునేదని గుర్తు చేశారు. అదే నేడు ప్రభుత్వ సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమని కేటీఆర్ పేర్కొన్నారు.