
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు తీసుకుని నిర్ణీత గడువులోగా కార్య కలాపాలు ప్రారంభించని వ్యక్తులు, సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పరిశ్రమల కోసం ప్రభుత్వం భూములు కేటా యించినా అందులో ఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న వాటిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. భూ కేటాయింపులు పొందిన కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ‘చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’పేరిట మార్పిడి చేసుకుని సంబంధిత భూముల్లో ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి వివరాలను కూడా సేకరించాలని మంత్రి ఆదేశించారు. అన్ని రకాల పరిశ్రమల సమగ్ర సమాచారాన్ని సేకరించి ‘బ్లూ బుక్’ తయారు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని రంగాలకు
చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమల వివరాలు సమగ్రంగా ఉండేలా చూడాలని, తద్వారా రాష్ట్ర పారిశ్రామిక సమ్మిళిత స్ఫూర్తి ఇతర కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఎస్‌ఎఫ్‌సీ విస్తరణకు ప్రణాళిక..
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్‌ఎఫ్‌సీ) కార్యకలాపాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని, దీనికి అవసరమైన సాయాన్ని అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఎస్‌ఎఫ్‌సీ విభజనకు సంబంధించి మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీఎస్‌ఎఫ్‌సీ ‘ఈ–ఎస్‌ఎఫ్‌సీ డిజిటల్ ప్లాట్‌ఫాం’ను మంత్రి ఆవిష్కరించారు.