ఐటీఐఆర్‌ సంగతేంటి?

KTR Letter To Union Minister Ravi Shankar Prasad - Sakshi

పునరుద్ధరిస్తారా.. లేక మెరుగైనది ఇస్తారా?

మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ స్ఫూర్తిని చూపించండి

కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌)ను పునరుద్ధరించడం లేదా అంతకంటే మెరుగైన మరో కార్య క్రమాన్ని చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభు త్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభు త్వం చెప్తున్న మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐ ఆర్‌ను ప్రారంభించాలని లేఖలో విన్నవిం చారు. కోవిడ్‌లాంటి సంక్లిష్ట సమయంలో ఐటీఐఆర్‌ను పునరుద్ధరిస్తే తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. 2014లో ఐటీఐఆర్‌ ప్రాజెక్టును సమీక్షించిన అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం అంతకంటే మేలైన పథకం తెస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐటీఐఆర్‌ భాగస్వాములతో 2017లో విస్తృత స్థాయి చర్చలు జరిగినా కేంద్రం నుంచి ప్రకటన రాని విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు.

ఐటీఐఆర్‌ను ప్రకటించి పదేళ్లు..
‘ఐటీఐఆర్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుని, 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేసింది. ఐటీఐఆర్‌ కోసం 49 వేల ఎకరాలతో పాటు మూడు క్లస్టర్లను కూడా గుర్తించారు. పెట్టుబడులు రప్పించేందుకు రూ.3,275 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రూ.165 కోట్లతో మొదటిదశను 2018 నాటికే పూర్తి చేసి, మిగతా పనులను వివిధ దశల్లో 20 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టులో మొదటిదశలో గుర్తించిన పనులకు సంబంధించి అదనపు నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా నిధులు లేక ఐటీఐఆర్‌ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు’అని కేటీఆర్‌ లేఖలో ప్రస్తావించారు.

సీఎం లేఖలు రాసినా స్పందన లేదు..
‘ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదు. అయినా రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి 2019–20 నాటికి రూ.1.28 లక్షల కోట్లకు చేరింది. ఐటీ రంగంలో ఆరేళ్లలో 110 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ.. అలాగే ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభంలోనూ తెలంగాణ ఐటీ పరిశ్రమలు ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి..’అని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఐటీ రంగం పూర్వస్థితికి చేరేందుకు కొంతసమయం పడుతుందని, హైదరాబాద్‌ ఐటీ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top