బోరబండ యువకుల 'డాక్టర్ గార్డ్' కంపెనీ.. ఫస్ట్‌ కస్టమర్‌ కేటీఆరే! | KTR Encourages Youth Entrepreneurship As Doctor Guard Starts Waterproof Solutions Company | Sakshi
Sakshi News home page

బోరబండ యువకుల 'డాక్టర్ గార్డ్' కంపెనీ.. ఫస్ట్‌ కస్టమర్‌ కేటీఆరే!

Oct 1 2025 12:23 PM | Updated on Oct 1 2025 1:50 PM

KTR Inspires Youth Led Startup in Hyderabad

హైదరాబాద్‌: తెలంగాణ యువతరాన్ని ఎప్పుడూ స్ఫూర్తి నింపడంలో ముందుండే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు (కేటీఆర్‌) మాటలు మరోసారి నిజమయ్యాయి. 'ఉద్యోగాలు అడిగే వారుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఉండాలి' అని కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన బోరబండకు చెందిన తొమ్మిది మంది యువకులు కలిసి 'డాక్టర్ గార్డ్' పేరుతో వాటర్‌ప్రూఫ్ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు.

ఉద్యోగ ప్రదాతలుగా యువకులు: యువ మిత్రులు ప్రారంభించిన కంపెనీ ప్రాంగణాన్ని వారి కోరిక మేరకు కేటీఆర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా యువకులతో మాట్లాడిన కేటీఆర్.. ఉద్యోగాలు అడగడం కాకుండా, పది మందికి ఉపాధి కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో వీరు ఈ కంపెనీని ప్రారంభించడం అభినందనీయమన్నారు. జేఎన్‌టీయూ ప్రసంగంలో కేటీఆర్ చెప్పిన మాటల స్ఫూర్తితోనే కంపెనీని ఏర్పాటు చేసినట్లు 'డాక్టర్ గార్డ్' బృందం తెలిపింది. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అయినప్పటికీ, తమ కళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో కంపెనీని స్థాపించినట్లు యువకులు తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీలో 30 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, రానున్న ఒక సంవత్సరంలోగానే ఈ సంఖ్యను వెయ్యికి పైగా తీసుకపోయే లక్ష్యంతో పనిచేస్తున్నామని వారు కేటీఆర్‌కు వివరించారు. తమ వాటర్‌ప్రూఫ్ సొల్యూషన్స్‌లో ప్రస్తుతం ఉన్న పద్ధతులకు మరింత ఆధునికతను, టెక్నాలజీని జోడించి ముందుకు తీసుకువచ్చినట్లు యువకులు కేటీఆర్‌కు తెలిపారు.

కంపెనీకి మొదటి కస్టమర్‌గా కేటీఆర్
కంపెనీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ బృందంలోని సోదరుడు ఇమ్రోజ్ సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పంపి, కేటీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే తాము కంపెనీని ప్రారంభించామని, తాము సాధించిన చిన్నపాటి కార్యకలాపాలను సందర్శించి తమకు మరింత స్ఫూర్తిని ఇవ్వాలని కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

యువకుల ప్రయత్నం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్, తమ కంపెనీకి మొదటి కస్టమర్‌గా తానే ఉంటానని సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌కు సంబంధించిన వాటర్‌ప్రూఫ్ పనులను వారికి అప్పగించారు. 24 ఏళ్ల లోపు వయసున్న ఈ మిత్ర బృందం ఎలాంటి నిరుత్సాహం లేకుండా తమ ఆలోచన పట్ల గొప్ప స్ఫూర్తితో ముందుకు పోతున్నారని కేటీఆర్ ప్రశంసించారు.

చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం విజయం సాధిస్తుంది..
ఎలాంటి ఆర్థిక పెట్టుబడి, కుటుంబ నేపథ్యం లేకున్నా మిత్ర బృందంతో కలిసి ఏషియన్ పెయింట్స్ పెట్టి విజయం సాధించిన స్ఫూర్తిని తాము తీసుకున్నామని యువకులు చెప్పడం అభినందనీయమన్నారు. మంచి మనసుతో, చిత్తశుద్ధితో ఏది ప్రారంభించినా అద్భుతమైన విజయం సాధిస్తుందని, సమాజంలోని అందరి అండ, ఆశీర్వాదం లభిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ తెలిపారు. 'డాక్టర్ గార్డ్' భవిష్యత్తులో అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ మిత్ర బృందం ప్రయత్నాన్ని చూసి మరింత మంది యువత ముందుకు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

తమ కార్యాలయానికి విచ్చేసిన కేటీఆర్ గారికి 'డాక్టర్ గార్డ్' బృందం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి, ఆయన స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement