Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలు.. తొలి ఓటు కేటీఆర్‌ది

KTR First Vote Polling for presidential election in Telangana - Sakshi

పోలింగ్‌ ప్రశాంతం

రెండో ఓటు వేసిన ఏపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి 

మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓటు వేసిన కేసీఆర్, ఇతర టీఆర్‌ఎస్‌ సీనియర్లు 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఓటుపై అయోమయం.. బ్యాలెట్‌ పేపర్‌ విషయంగా చర్చ 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 118 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరు ఓటు వేయలేదు. కరోనా, డెంగీతో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండటంతో ఓటు వేయలేదు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు విదేశాల్లో ఉండటంతో ఓటు వేయలేకపోయారు. దీనితో తెలంగాణకు సంబంధించి 117 ఓట్లు పోలవగా.. ఏపీకి చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఎన్నికల సంఘం అనుమతితో ఇక్కడే ఓటు వేశారు. దీనితో మొత్తం 118 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) ఓటు విషయంగా కొంత గందరగోళం నెలకొంది. 

తొలిఓటు వేసిన కేటీఆర్‌ 
సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరిగింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తొలిఓటు వేయగా.. ఏపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి రెండో ఓటు వేశారు. ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేరుగా అసెంబ్లీకి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, పోదెం వీరయ్య కలిసి వచ్చి ఓటేయగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి విడివిడిగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి వెళ్లి ఓటేశారు. బీజేపీ ముగ్గురు సభ్యుల్లో రఘునందన్‌రావు, రాజాసింగ్‌ ఉదయం, ఈటల రాజేందర్‌ మధ్యాహ్నం ఓటు వేశారు. కాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా తరఫున టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, హన్మంత్‌ షిండే, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పోలింగ్‌ ఏజెంట్లుగా.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తరఫున బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పోలింగ్‌ ఏజెంట్‌గా వ్యవహరించారు. పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ బాక్స్‌ను అసెంబ్లీలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. మంగళవారం తెల్లవారుజామున వాటిని ఢిల్లీకి తరలించనున్నారు. 

సీతక్క ఓటుపై అయోమయం 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క బ్యాలెట్‌ పేపర్‌పై ఓటేసే సమయంలో ఎక్కువ సమయం ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌ వద్దే ఉండిపోయారు. ఇది గమనించిన కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్‌ మహేశ్వర్‌రెడ్డి.. బ్యాలెట్‌ విషయంగా ఏదైనా అనుమానం ఉంటే మరో బ్యాలెట్‌ తీసుకోవాలని సూచించారు. దీంతో సీతక్క మరో బ్యాలెట్‌  పేపర్‌ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారులను కోరారు. ఓ అభ్యర్థి పేరు పక్కన బాక్స్‌లో ఒకటి అని ప్రాధాన్యత ఓటు వేసి.. పైన అభ్యర్థుల పేర్లు అని ఉన్న చోట పొరపాటున ‘రైట్‌ మార్క్‌’ వేశానని.. మరో బ్యాలెట్‌ పేపర్‌ ఇవ్వాలని ఆమె కోరడం కనిపించింది.
ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సీతక్క 

ఎన్నికల అధికారులు దీనిపై ఈసీ ఉన్నతాధికారులను సంప్రదించి, మరో బ్యాలెట్‌ పేపర్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో సీతక్క అదే బ్యాలెట్‌ పత్రాన్ని బాక్సులో వేసి వెనుదిరిగారు. బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బ్యాలెట్‌పై పెన్ను గుర్తు పడడం వల్ల మరో బ్యాలెట్‌ ఇవ్వాలని కోరానని, అధికారులు ఇవ్వలేదని చెప్పారు. అయితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయిన సీతక్క.. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టుగా ప్రసార సాధనాల్లో ప్రచారం జరిగింది. దీనిపై సీతక్క ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. తాను ఓటేసేప్పుడు ఎలాంటి తప్పు దొర్లలేదని, ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేశానని.. మరో పేపర్‌ ఇవ్వనందున ఇంకు పడిన బ్యాలెట్‌నే బాక్సులో వేశానని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top