ముఖ్యమంత్రివా.. ముఠా నాయకుడివా? | KTR fires on Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రివా.. ముఠా నాయకుడివా?

Jan 19 2026 5:55 AM | Updated on Jan 19 2026 5:58 AM

KTR fires on Revanth Reddy: Telangana

బీఆర్‌ఎస్‌ జెండా గద్దెలను ధ్వంసం చేయాలన్న రేవంత్‌పై కేటీఆర్‌ ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: శాంతిభద్రత లను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అసాంఘిక చర్యలు, నేరాలను ప్రోత్సహించేలా సీఎం రేవంత్‌ మాట్లాడటం సిగ్గుచేటు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ జెండా గద్దెలను ధ్వంసం చేసి పార్టీని రాజకీయంగా బొందపెట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా’అని రేవంత్‌ను ప్రశ్నిస్తూ కేటీఆర్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న రేవంత్‌రెడ్డి.. కనీస సోయి లేకుండా ఇలాంటి హింసాత్మక పిలుపు ఇవ్వడం అరాచకానికి దారితీస్తుందని హెచ్చరించారు. గడిచిన పదేళ్లలో శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో ఇప్పుడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచేవారు అధికారంలో ఉండటం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

గులాబీ జెండాపై చెక్కుచెదరని అభిమానం
తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కు చెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్‌బ్లాక్‌ అయ్యిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేవలం రెండేళ్లలోనే అట్టర్‌ ఫ్లాప్‌ పాలనతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్‌రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఖమ్మం సభ సాక్షిగా తేలిపోయిందని విమర్శించారు. సోషల్‌ మీడియాలో చిన్న పోస్టుకే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీస్‌శాఖ, డీజీపీ..ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన ఈ తీవ్రమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా టీడీపీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్రతెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్‌ అన్నారు.

గత రెండేళ్లుగా తన పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జల హక్కులను కాలరాశారని, ఈ రోజు ఆయన చేసిన ప్రకటనతో నిజస్వరూపం బట్టబయలైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక మునిగిపోయే నావ అని అర్థం కావడంతోనే, రేవంత్‌రెడ్డి ఏ క్షణమైనా దాని నుంచి బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలు పన్నుతున్నారని కేటీఆర్‌ హెచ్చరించారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకూ తెలంగాణ ప్రయోజనాలను పాతాళంలోకి నెట్టిన ఈ కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్‌ హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement