ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండలం దారేడుకు చెందిన బత్తిని కిరణ్‌ను విచారణ పేరిట పిలిచించిన ఎస్‌ఐ విపరీతంగా కొట్టాడని ఆయన తండ్రి, గ్రామ మాజీ సర్పంచ్ సీపీఐకి చెందిన బత్తిని సీతారాములు వెల్లడించారు. వీరి ఇంటి పక్కన వారితో కిరణ్‌కు కుటుంబ విషయంలో తగాదా జరిగింది. దీంతో పక్కింటి వ్యక్తి రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మంగళవారం విచారణకు పిలిపించడంతో వెళ్లిన కిరణ్‌ను ఎస్‌ఐ హరికృష్ణ విపరీతంగా కొట్టాడని ఆరోపించారు.
దెబ్బలు తాళలేక భయపడిన కిరణ్‌కు ఫిట్స్ వచ్చి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న సీపీఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు, నాయకులు దండి సురేష్, పుచ్చకాయల సుధాకర్ తదితరులు పరామర్శించారు. కాగా, ఘటనపై ఎస్‌ఐ హరికృష్ణ వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా స్పందించలేదు. ఇదే విషయమై సీఐ ఎం.రాజుతో మాట్లాడగా కిరణ్‌ను విచారణకు పిలిపించిన మాట వాస్తవమేనని తెలిపారు. కానీ ఎస్సై ఆయనను కొట్టలేదని, ఆయనకు గతంలోనే ఫిట్స్ ఉండగా భయంతో పడిపోవడంతో ఆస్పత్రికి పంపించామని స్పష్టం చేశారు.


