
సాక్షి, హైదరాబాద్: ‘సృష్టి’ కేసులో గోపాలపురం పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్‌లను వాడి నమ్రత పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు తేలింది. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి షాక్ తిన్న.. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన నమ్రత.. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, ఏజెంట్‌ల వివరాలు లేవంటూ ఆమె చెప్పింది. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య మొత్తం 26కి చేరింది.
కాగా, ఈ కేసులో నిందితురాలైన విద్యుల్లతకు బెయిల్ లభించింది. కేసులో ఏ16గా ఉన్న ఆమెకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సోమవారం.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో డాక్టర్ విద్యులత ఉన్నారు. A3 కల్యాణి, A6 సంతోషిల ఐదు రోజుల కస్టోడీయల్ విచారణ నేటితో ముగిసింది. నిందితులను గోపాలపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.