
అత్తారింటి నుంచి ఈడ్చుకెళ్లిన తల్లిదండ్రులు
అడ్డొచ్చిన భర్త, కుటుంబ సభ్యులపై దాడి
కీసర పరిధిలో సినీ ఫక్కీలో ఘటన
సాక్షి, కీసర: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న తమ కూతురిని అత్తారింటి నుంచి బలవంతంగా సినీఫక్కీలో ఆమె తల్లిదండ్రులు ఈడ్చుకెళ్లారు. అడ్డు వచ్చిన బాధితురాలి భర్త, ఆయన కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నర్సంపల్లికి చెంది జలగం ప్రవీణ్, ఇదే గ్రామానికి చెందిన శ్వేత ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం నచ్చని యువతి తల్లిదండ్రులు ప్రవీణ్ నుంచి తమ కూతురును ఎలాగైనా విడదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం శ్వేత తల్లిదండ్రులు బాల నర్సింహ, మహేశ్వరి, మేనమామ మోహన్, తమ్ముడు సాయితో పాటు మరికొందరు ఉదయం 9 గంటల సమయంలో ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు.
ప్రవీణ్‌తో పాటు ఆయన తల్లి, కుటుంబ సభ్యుల కళ్లలో కారం చల్లి, తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేశారు. శ్వేతను కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ప్రవీణ్ పాటు ఆయన తల్లికి గాయాలయ్యాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమపై దాడికి పాల్పడి శ్వేతను బలవంతంగా కిడ్నాప్ చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడు ప్రవీణ్ కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.
