‘అనుమతి’ లేకుంటే అంతే..  | KCR Speaks About Registration Process | Sakshi
Sakshi News home page

‘అనుమతి’ లేకుంటే అంతే.. 

Aug 30 2020 3:13 AM | Updated on Aug 30 2020 3:13 AM

KCR Speaks About Registration Process - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనుమతులు లేని లే అవుట్లలోని స్థలాలు, భవనాలు, ఇతర నిర్మాణాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ ఉత్తర్వుల ప్రభావం పెద్దగా కనిపించకపోయినా మిగిలిన చోట్ల మాత్రం రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రెండో రోజు వరుసగా వ్యవసాయ భూములు, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులున్న భూములు, భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు పరిమితమయ్యాయి. తాజా ఉత్తర్వులతో అర్బన్, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.  

డాక్యుమెంట్‌ రైటర్ల స్థాయిలోనే... 
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి డాక్యుమెంట్‌ రైటర్ల నుంచే ఎల్‌ఆర్‌ఎస్‌ ఉందా? మున్సిపల్, పంచాయతీల అనుమతులున్నాయా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే డాక్యుమెంట్‌ రైటర్లతో సమావేశమైన సబ్‌ రిజిస్ట్రార్లు అనుమతులు లేని వాటికి డాక్యుమెంట్లు సిద్ధం చేసి తమ వద్దకు పంపవద్దని ఆదేశాలిచ్చారు. దీంతో అనుమతులకు సంబంధించిన పత్రాలు చూపెడితేనే రాష్ట్ర వ్యాప్తంగా రైటర్లు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. దీంతో అనుమతులు లేని డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ డాక్యుమెంట్‌ రైటర్ల స్థాయిలోనే వరుసగా రెండో రోజు నిలిచిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న ప్రజలు వెనుతిరిగి పోతున్నారు. కొందరు తమ వద్దకు వచ్చి గతంలో మీరే రిజిస్ట్రేషన్‌ చేశారు కదా.. ఇప్పుడెందుకు చేయరంటూ ప్రశ్నిస్తున్నారని సబ్‌ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. అనుమతి లేకపోతే గతంలో ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారని అడుగుతున్న ప్రశ్నలకు సబ్‌ రిజిస్ట్రార్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.

సీఎం గుస్సా?...
తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై రిజిస్ట్రేషన్‌ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఇలాంటి ఉత్తర్వులు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం సీఎం కేసీఆర్‌ ఆగ్రహం కారణంగా స్పష్టమైన ఉత్తర్వులు వచ్చాయని తెలుస్తోంది. పాలనలో పారదర్శకత కోసం కొత్త చట్టాలు తెస్తున్నామని, అయినా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయని ఇటీవల జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులను సీఎం గట్టిగా ప్రశ్నించారని, ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు వచ్చాయనే చర్చ రిజిస్ట్రేషన్‌ శాఖ వర్గాల్లో జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement